IND vs AUS Ricky Ponting Predicts India Losing Border Gavaskar Series | హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే అగ్రెసివ్ నేచర్, నోటి దురుసు, ఏదైనా చేసి గెలవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని క్రికెట్ ప్రేమికులకు తెలుసు. త్వరలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. నవంబర్ 22న ప్రారంభం కానున్న ఈ కీలక సిరీస్ భారీ తేడాతో నెగ్గి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఆసీస్ జట్టు చిత్తు చేస్తుందని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
కివీస్ చేతిలో వైట్ వాష్ తో పెరిగిన కష్టాలు
ఇటీవల రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3తో వైట్ వాష్ చవిచూసింది. సొంతగడ్డపై కివీస్‌తో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ భారీ పరాజయంతో టీమిండియా ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ పూర్తిగా వైఫల్యం చెందాక.. WTC ఫైనల్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాల్ని మరింత కఠినం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియాపై భారీ తేడాతో టెస్ట్ సిరీస్ నెగ్గితే రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ అసాధ్యమని క్రికెట్ మాజీలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఆసీస్ చేతిలో భారత్ 3-1తో టెస్ట్ సిరీస్ ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. ఆసీస్ గడ్డపై గెలుపు అంత ఈజీ కాదు. తమ గడ్డమీద ఆడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారీ తేడాతో నెగ్గడం కాదు, సిరీస్ నెగ్గడమే అసలుసిసలైన సవాల్ అన్నాడు.
టీమిండియా అనుభవం, ఆసీస్ గడ్డపై కంగారు జట్టుకు ఉన్న బలం, ప్రయోజనాలను అంచనా వేసిన రికీ పాంటింగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తమ జట్టు 3-1తో నెగ్గుతుందని దీమా వ్యక్తం చేశాడు. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భారత్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందని పాంటింగ్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్వదేశంలో ఆడటం ఎప్పటికీ ప్లస్ పాయింట్. సిరీస్ అయితే భారత్ కచ్చితంగా ఓడిపోతుందని.. ఎంత తేడాతో ఆసీస్ నెగ్గుతుందో ఐసీసీ రివ్యూలో పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
షమీ లేకపోవడం భారత్ కు మైనస్
2023 వన్డే ప్రపంచ కప్ తరువాత నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ జట్టుతో లేకపోవడం వారి కష్టాలు పెంచుతుంది. త్వరలో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరం. అయితే గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్ నెస్ సాధించే ఛాన్స్ లేదని షమీని తీసుకోవడం లేదు. ఆసీస్ లాంటి పిచ్ లపై అనుభవం ఉన్న షమీ లాంటి బౌలర్ లేకపోవడం భారత్ కు నిజంగానే పెద్ద దెబ్బ.
షమీ ఫిట్‌గా ఉంటాడా లేదా అనే దానిపై గత ఆగస్టులో సందేహం ఉండేది. టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి 20 వికెట్లు ఆసీస్ గడ్డపై తీయడం భారత బౌలర్లకు సవాల్. అయితే బ్యాటర్లు మాత్రం కాస్త పోరాటం చేస్తారని భావిస్తున్నట్లు రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ ఆసీస్ లో ఆడటం అంత తేలిక కాదని భారత బ్యాటర్లకు కూడా తెలుసు. ఈ టెస్ట్ సిరీస్ ను కచ్చితంగా ఆసీస్ జట్టు నెగ్గుతుందని రికీ పాంటింగ్ మరోసారి చెప్పుకొచ్చాడు.
Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు