ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. ఆదివారం ఇండోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 99 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం వర్షం ఆటంకం కలిగించడంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ తరఫున ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104: 97 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105: 90 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), షాన్ అబాట్ (54: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీలతో నిలిచారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున కామెరాన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ 103 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆఖర్లో పోరాడిన ఆస్ట్రేలియా
400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. రెండో ఓవర్లోనే ప్రసీద్ కృష్ణ వరుస బంతుల్లో మాథ్యూ షార్ట్ (9: 8 బంతుల్లో, రెండు ఫోర్లు), స్టీవ్ స్మిత్‌లను (0: 1 బంతి) అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు తొమ్మిది పరుగులు మాత్రమే. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), మార్నస్ లబుషేన్ (27: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు) జట్టును ముందుకు నడిపించారు. తొమ్మిది ఓవర్లలో జట్టు స్కోరు 56 పరుగుల వద్ద వర్షం ఆటంకం కలిగించింది. అనంతరం లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించారు. అంటే అక్కడి నుంచి 24 ఓవర్లలో 269 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ ఒత్తిడిలో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు. భారీ షాట్లకు ప్రయత్నించి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. దీంతో ఒక దశలో 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. అనంతరం షాన్ అబాట్ (54: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), జోష్ హజిల్‌వుడ్ (23: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. తొమ్మిదో వికెట్‌కు కేవలం 7.2 ఓవర్లలోనే 77 పరుగులు జోడించారు. వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
దూకుడుగా ఆడిన టీమిండియా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలనే నిర్ణయించుకుంది. జట్టు స్కోరు 16 వద్ద ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8: 12 బంతుల్లో, రెండు ఫోర్లు)ని హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. వన్‌డౌన్లో దిగిన శ్రేయస్ అయ్యర్ (105: 90 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) రావడంతోనే బౌండరీ కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పాడు. సొగసైన బౌండరీలు బాదేశాడు. శుభ్‌మన్ గిల్‌తో (104: 97 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి ఆసీస్ బౌలర్లను చితకబాదాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ ధాటికి 12.5 ఓవర్లకు భారత జట్టు స్కోరు 100కు చేరుకుంది. గిల్ 37, అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఆ తర్వాత వేగం మరింత పెంచారు. ఇదే ఊపులో శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో జట్టు స్కోరు 216 వద్ద షాన్ అబాట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్ అండతో శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టాడు. ఇందుకు తనకు 92 బంతులే అవసరం అయ్యాయి. జట్టు స్కోరు 243 వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాకే అసలు ఊచకోత మొదలైంది. కేఎల్ రాహుల్ తన క్లాసిక్ టచ్‌ను ప్రదర్శించాడు. కేవలం 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (31: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) సైతం కుమ్మేశాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ స్టేడియం చుట్టూ సిక్సర్లు, బౌండరీలు కొట్టాడు. కేఎల్ రాహుల్‌తో 34 బంతుల్లో 53, రవీంద్ర జడేజాతో 24 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. దాంతో భారత జట్టు 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.