టీమిండియా వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి.


భారత్ తరఫున కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు) జట్టును విజయ పథం వైపు నడిపించారు. వీరే టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) అత్యధిక స్కోరు సాధించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.


ప్రారంభంలో భారీ షాకులు
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలో భారీ షాకులు తగిలాయి. మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను (0: 1 బంతి) మిషెల్ స్టార్క్ అవుట్ చేసి ఆస్ట్రేలియాకు మొదటి వికెట్ అందించాడు. రెండో ఓవర్లో రోహిత్ శర్మ (0: 6 బంతుల్లో), ఇషాన్ కిషన్‌లను (0: 3 బంతుల్లో) జోష్ హజిల్‌వుడ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో భారత్ కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


ఇక భారత్ కోలుకోవడం కష్టమే అనుకున్నారు కానీ విరాట్ కోహ్లీ (85: 116 బంతుల్లో, ఆరు ఫోర్లు), కేఎల్ రాహుల్ (97 నాటౌట్: 115 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) మాత్రం అదరగొట్టారు. ప్రారంభంలో వికెట్లు కాపాడుకోవడానికి మెల్లగా ఆడిన ఈ జోడి మెల్లగా గేర్లు మార్చింది. నాలుగో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించి భారత్‌ను విజయం ముంగిట వీరు నిలిపారు. కింగ్ కోహ్లీ శతకం మార్కును అందుకుంటాడు అనుకున్నా... విజయానికి కొద్ది పరుగుల ముంగిట అవుటయ్యాడు. కానీ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో (11 నాటౌట్: 8 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి మ్యాచ్‌ను ముగించాడు.


ఆదుకున్న స్మిత్, వార్నర్
జట్టు స్కోరు ఐదు పరుగుల వద్దే ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (0: 6 బంతుల్లో) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పరిస్థితులపై అవగాహన ఉన్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (41: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (46: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఆచితూచి ఆడారు. రెండో వికెట్‌కు 85 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. గేర్లు మార్చే తరుణంలో డేవిడ్‌ వార్నర్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ కాట్ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి స్కోరు 74. ఈ సిచ్యువేషన్లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మార్నస్‌ లబుషేన్ (27: 41 బంతుల్లో, ఒక ఫోర్) స్మిత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 36 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.


టీమ్‌ఇండియా బౌలర్లు పక్కా లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు వేస్తుండటంతో ఆసీస్‌ స్కోరు వేగం తగ్గింది. అయితే వరుస ఓవర్లలో జడ్డూ మూడు వికెట్లు తీసి కంగారూలకు షాకిచ్చాడు. 27.1వ బంతికి స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 30వ ఓవర్లో ఒక బంతి అంతరంతోనే లబుషేన్‌, అలెక్స్‌ కేరీ (0: 2 బంతుల్లో)ని పెవిలియన్‌కు పంపించాడు. 39.3 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు 150కి చేరుకుంది. కామెరాన్‌ గ్రీన్‌ (8: 20 బంతుల్లో) త్వరగానే పెవిలియన్‌ చేరాడు. దూకుడుగా ఆడే క్రమంలో ప్యాట్‌ కమిన్స్‌ (15: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో 165 పరుగులకేకే కంగారూలు 8 వికెట్లు చేజార్చుకున్నారు. ఆఖర్లో మిచెల్‌ స్టార్క్‌ (28: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాటంతో ఆసీస్‌ స్కోరు 199కి చేరుకుంది.