India vs Australia 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 24వ తేదీ ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఆరేళ్ల తర్వాత ఈ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి వన్డేలో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది. రెండో వన్డేలో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం.


తొలి వన్డేలో ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. జట్టు కేవలం ఒక ప్రధాన ఫాస్ట్ బౌలర్, ఒక ప్రధాన స్పిన్నర్‌తో మాత్రమే బరిలోకి దిగింది. మిగిలిన వారంతా ఆల్‌రౌండర్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వన్డేలో బౌలింగ్ విభాగంలో మార్పులు చేయవచ్చు. జోష్ హేజిల్‌వుడ్, తన్వీర్ సంఘ రెండో వన్డే కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరే అవకాశం ఉంది.


తొలి వన్డేలో శార్దూల్‌ ఠాకూర్‌ మినహా మిగతా ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేశారు. బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో రాణించారు. మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకుండానే టీమ్ ఇండియా రెండో వన్డేలో అడుగుపెట్టవచ్చు.


ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఆదివారం ఇక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే మ్యాచ్ సమయంలో మేఘావృతమై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రారంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించవచ్చు. అయితే బంతి పాతదైతే పరుగులు చేయడం సులభం అవుతుంది.


స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు మరోసారి రంగంలోకి దిగనుంది. అప్పటికీ ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు ఫేవరెట్‌గా నిలవనుంది. మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఛేజింగ్‌లో ఉన్న జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


భారత తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ


ఆస్ట్రేలియా తుదిజట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, తన్వీర్ సంఘా, పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్ మరియు ఆడమ్ జంపా 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial