ODI World Cup  2023 : రెండేండ్లుగా భారత క్రికెట్ జట్టులో సరిగ్గా ఆడినా ఆడకున్నా అత్యధిక అవకాశాలు దక్కించుకున్న ఆటగాడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శార్దూల్ ఠాకూర్. ముంబైకి చెందిన ఈ మీడియం పేస్  బౌలర్.. అప్పుడో ఇప్పుడో బ్యాట్ ఝుళిపించి ఆల్ రౌండర్‌గా కూడా  చలామణి అవుతున్నాడు. గత ఫామ్ అంత గొప్పగా లేకపోయినా  తాజాగా స్వదేశంలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో  కూడా చోటు దక్కించుకున్నాడు.  బ్యాటింగ్‌లో లోతు (డెప్త్) కోసమని శార్దూల్‌ను ఎంపికచేసినట్టు టీమిండియా సారథి రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్  అజిత్ అగార్కర్‌లు వెల్లడించిన నేపథ్యంలో  శార్దూల్ నిజంగా అంత బాగా బ్యాటింగ్ చేయగలడా..? ఠాకూర్ ఎంపిక సరైందేనా..? అన్న అనుమానాలు తలెత్తెతున్నాయి. 


ఇదేనా బ్యాటింగ్ డెప్త్.. 


2017లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన  శార్దూల్.. ఇప్పటివరకూ ఆరేండ్లలో 43 వన్డేలు ఆడి  329 పరుగులు చేశాడు.  8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే శార్దూల్..  2021 వరకూ అడపాదడపా ఆడినా ఆ ఏడాది నుంచి మాత్రం  వన్డేలలో టీమిండియాకు రెగ్యులర్ మెంబర్ అయ్యాడు.  2022 నుంచి నిన్నటి  ఆసీస్ మ్యాచ్ వరకూ అతడు 28 వన్డేలు ఆడాడు. ఇందులో 16 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి చేసిన పరుగులు 211. 2021 నుంచి బ్యాటింగ్‌లో అతడి సగటు  14.5గా ఉంది. గడిచిన పది ఇన్నింగ్స్‌లలో  శార్దూల్ స్కోర్లు ఇవి.. 11, 3, 16, 1, 25, 3, 3, 7, 2, 1.. రెండంకెల స్కోరు చేయడానికే నానా తంటాలు పడుతున్న  బ్యాటింగ్‌లో డెప్త్ చూపించగలడా..?


బౌలర్‌గా అయినా...


సరే,  బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే అతడి ప్రధాన  అస్త్రం బౌలింగ్.   43 మ్యాచ్‌లలో  శార్దూల్ తీసింది 63 వికెట్లు.  శార్దూల్ బంతి పట్టాడంటే  ప్రత్యర్థి స్కోరు వేగం పుంజుకుంటుంది.  ధారాళంగా పరుగులివ్వడంలో అతడికి అతడే సాటి.  2022 నుంచి శార్దూల్ 29 మ్యాచ్‌లలో  తీసిన వికెట్ల సంఖ్య 41 మాత్రమే.  శార్దూల్ బౌలింగ్ సగటు 29.11 గా ఉండగా ఎకానమీ కూడా ఏకంగా 6.17గా నమోదైంది.  బుమ్రా, సిరాజ్, షమీల కంటే ఇది  చాలా ఎక్కువ.  తాజాగా ఆసీస్‌తో  తొలి వన్డేలో   శార్దూల్ పది ఓవర్లు వేసి  ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. 


వాళ్ల వైఫల్యం..  ఠాకూర్‌కు అదృష్టం.. 


ప్రస్తుతం వరల్డ్  కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో భారత జట్టు తరఫున ఒక్క లెఫ్టార్మ్ పేసర్ కూడా లేడు. టీమిండియాలో అర్ష్‌దీప్ సింగ్ రూపంలో  ఒక ఎడమ చేతి వాటం బౌలర్ ఉన్నాడు.  కానీ  గతేడాది జట్టులోకి వచ్చిన  అర్ష్‌దీప్ వన్డేలలో ఇంకా  సెటిల్ కాలేదు.  అదీగాక ఇటీవల  అతడు లయ కోల్పోయి ఇబ్బందిపడుతున్నాడు.  ఉమ్రాన్ మాలిక్‌దీ అదే పరిస్థితి.  ఈ ఇద్దరూ  విఫలమవడం  శార్దూల్‌కు కలిసొచ్చింది. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే   టీమిండియా అతడు వరుసగా విఫలమైనా రెండేండ్లుగా బలవంతంగా అయినా అతడిని భరిస్తోంది. 


 






శార్దూల్ రుజువు చేసుకుంటాడా..? 


బౌలింగ్‌తో పాటు  బ్యాటింగ్ చేయగలడన్న కారణంతో శార్దూల్‌ను టీమ్‌‌లో ‘ఇరికించిన’ టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదంటే శార్దూల్ శక్తివంచన లేకుండా రాణించాల్సి ఉంది. తనను తాను నిరూపించుకోవడమే గాక  జట్టుకూ ఉపయోగపడితే తనపై వస్తున్న విమర్శలకు  ధీటుగా సమాధానం ఇచ్చినట్టే.  ఒకవేళ శార్దూల్‌ను తుది జట్టులో ఆడిస్తే  ఒక సీమర్‌ను లేదా స్పిన్నర్‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది.  అలా కాకుండా నేరుగా శార్దూల్‌ను ఆడించే అవకాశాలైతే తక్కువ. మరి టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టిన నమ్మకాన్ని  శార్దూల్ ఏ మేరకు  కాపాడుకుంటాడో తెలియాలంటే  మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.