Steve Smith Century WTC Final 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. అంతకుముందు ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో తొలిరోజు సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఓవల్‌లో ట్రావిస్ హెడ్ (163: 174 బంతుల్లో, 25 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (121: 268 బంతుల్లో, 19 ఫోర్లు) జోడీ భారత బౌలర్లకు చెమటలు పట్టించింది.
స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ స్మిత్ ఇప్పటివరకు 31 టెస్టు సెంచరీలు చేశాడు. ఈ విషయంలో రికీ పాంటింగ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ మొత్తంగా 41 సెంచరీలు చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా 32 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఉన్న మాథ్యూ హేడెన్ 30 సెంచరీలు చేశాడు. ఆల్‌టైం గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 29 సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు.
రెండో రోజు మ్యాచ్‌లో భారత్ మొదటి సెషన్‌లో కమ్ బ్యాక్ ఇచ్చింది. టీమిండియాకు భారీగా డ్యామేజ్ చేసిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఇద్దరినీ భారత బౌలర్లు పెవిలియన్ బాట పట్టించారు. వీరు నాలుగో వికెట్‌కు ఏకంగా 285 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు భారత్‌పై ఆస్ట్రేలియా సాధించిన మూడో అత్యధిక భాగస్వామ్యం ఇదే. రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ (386, 2012 అడిలైడ్‌లో), రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ (288, 2012 సిడ్నీలో) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రెండు భాగస్వామ్యాలు 2012 ఆస్ట్రేలియా పర్యటనలోనే వచ్చాయి.
మరోవైపు భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు మొదటి సెషన్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ (12 బ్యాటింగ్: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), మిషెల్ స్టార్క్ (3 బ్యాటింగ్: 15 బంతుల్లో) ఉన్నారు. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది.