ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నాలుగో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (41 బ్యాటింగ్: 61 బంతుల్లో, ఐదు ఫోర్లు), మిషెల్ స్టార్క్ (11 బ్యాటింగ్: 19 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 374 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవల్‌లో అత్యధిక లక్ష్యఛేదన 263 పరుగులు మాత్రమే. కాబట్టి భారత్ విజయం సాధించాలంటే అద్భుతం జరగాల్సిందే.


123/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో నిలదొక్కుకున్న మార్నస్ లబుషేన్‌ను (41: 126 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఉమేష్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు.


ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (25: 95 బంతుల్లో, నాలుగు ఫోర్లు), అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. కానీ అలెక్స్ క్యారీ, మిషెల్ స్టార్క్ మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.