భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా వెనక్కి పంపింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (163: 174  బంతుల్లో, 25 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (121: 268 బంతుల్లో, 19 ఫోర్లు) రాణించారు. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


సిరాజ్ మియాకు నాలుగు వికెట్లు
రెండో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో), అలెక్స్ క్యారీ (48: 69 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఆఖర్లో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. అలెక్స్ క్యారీ అవుటయ్యాక నాథన్ లియాన్ (9: 25 బంతుల్లో, ఒక ఫోర్), ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో) కూడా త్వరగా అవుటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీసుకున్నాడు.


అంతకు ముందు రెండో రోజు ఆట ప్రారంభం అయిన మొదటి మూడు బంతుల్లోనే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్... మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండు, మూడు బంతులను బౌండరీలుగా తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 150 పరుగుల మైలురాయిని దాటాడు.


ఆట ప్రారంభం అయ్యాక ఏడో ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పుల్ షాట్ ఆడబోయిన హెడ్... వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరిద్దరూ జోడించిన 285 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. భారత్‌కు ఊరట కలిగింది. ఆ తర్వాత కాసేపటికే కామెరాన్ గ్రీన్ (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), స్టీవ్ స్మిత్ కూడా అవుటయ్యారు.


కానీ మిషెల్ స్టార్క్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కలిసి స్కోరును 400 మార్కు దాటించారు. అయితే క్యారీతో సమన్వయ లోపం కారణంగా మిషెల్ స్టార్క్ (5: 20 బంతుల్లో) రనౌట్ అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.