IND vs AUS 3rd Test Day 1:
ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమ్‌ఇండియా ఘోర ప్రదర్శన చేసింది. 33.2 ఓవర్లకే కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (21; 18 బంతుల్లో 3x4), విరాట్ కోహ్లీ (22; 52 బంతుల్లో 2x4) టాప్ స్కోరర్లు. మాథ్యూ కుహెన్‌మన్ (5/16), నేథన్ లైయన్ (3/35) హిట్‌మ్యాన్ సేనను దెబ్బకొట్టారు. చూస్తుంటే ఆతిథ్య జట్టు తను తీసిన గోతిలో తానే పడ్డట్టు అనిపిస్తోంది. 2017లో ఇదే ఆసీస్‌పై పుణెలో టీమ్‌ఇండియా 107, 105కి ఆలైటైంది. ఆ తర్వాత సొంత దేశంలో ఇదే అతి తక్కువ స్కోరు. మొత్తంగా ఐదో అత్యల్ప స్కోరు!
ఇదీ ప్లాన్!
పిచ్‌పై పగుళ్లు విపరీతంగా ఉండటంతో టీమ్‌ఇండియా వెంటనే బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ గడిచే కొద్దీ మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకే మొదటే భారీ స్కోరు చేయడం మంచిదని అనుకుంది. కానీ ఈ ఆశలు అడియాసలే అయ్యారు. కొత్త కుర్రాడు. కుహెన్‌మన్ తన సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్‌కు జత కలిశాడు. ఆతిథ్య జట్టును తన గింగిరాలు తిరిగే బంతులతో వణికించాడు. అత్యల్ప స్కోరుకు ఆలౌటయ్యేలా చేశాడు.
ఇదీ జరిగింది!
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మోస్తరు భాగస్వామ్యం అందించారు. పేసర్ల బౌలింగ్ లో స్వేచ్ఛగా ఆడుతూ తొలి వికెట్ కు 27 పరుగులు జోడించారు. స్పిన్నర్లు వచ్చాకే భారత పతనం మొదలైంది. కుహెన్‌మన్ బౌలింగ్ రోహిత్ (23 బంతుల్లో 12 పరుగులు) స్టంపౌట్ అయ్యాడు. ఆ వెంటనే గిల్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కీలకమైన పుజారా (4 బంతుల్లో 1), రవీంద్ర జడేజా (9 బంతుల్లో 4)ను లైయన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే శ్రేయస్ అయ్యర్ కుహెన్‌మన్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో 45 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది.
ఇలా పోరాడారు!
ఈ దశలో విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 22), కేఎస్ భరత్ (30 బంతుల్లో 17)లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కుదురుకున్నట్లే కనిపించిన ఈ జంటను కోహ్లీని ఔట్ చేయడం ద్వారా మర్ఫీ విడదీశాడు. ఆ వెంటనే భరత్ కూడా లియాన్ బౌలింగ్ లో వికెట్ ఇచ్చేశాడు. 84/4తో భారత్ లంచ్‌కు వెళ్లింది. అక్షర్ పటేల్ (33 బంతుల్లో 12 నాటౌట్) టెయిలెండర్లతో కలిసి ఆదుకొనేందుకు ప్రయత్నించాడు. ఉమేశ్ యాదవ్ (17) రెండు సిక్సర్లు బాది స్కోరును వంద దాటించాడు. అతడినీ, అశ్విన్ (3)ను కుహెన్‌మన్ ఔట్ చేశాడు. సిరాజ్ (0) రనౌట్ అవ్వడంతో భారత్ 109కి కుప్పకూలింది.