IND vs AUS 3rd test Day 1:  ఇండోర్ పిచ్ పై పగుళ్లు చూసి స్పిన్ కు సహకరిస్తుందని ముందే అంచనాకు వచ్చారు. ముందు బ్యాటింగ్ చేసి వీలైనంత ఎక్కువ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచాలని అనుకున్నారు. అనుకున్నట్లే టాస్ కలిసొచ్చి మొదట బ్యాటింగ్ ఎంచుకంది టీమిండియా. అయితే తొలిరోజే స్పిన్ కు బాగా అనుకూలించిన పిచ్ పై మన బ్యాటర్లు నిలవలేకపోయారు. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఫలితం తొలి రోజు తొలి సెషన్ లోనే ఆస్ట్రేలియా టీమిండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు లంచ్ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 


పేకమేడలా వికెట్లు


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు పర్వాలేదనిపించే భాగస్వామ్యమే అందించారు. పేసర్ల బౌలింగ్ లో స్వేచ్ఛగా ఆడిన వీరిద్దరూ తొలి వికెట్ కు 27 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్లు వచ్చాకే భారత పతనం మొదలైంది. కున్హెమాన్ బౌలింగ్ రోహిత్ (23 బంతుల్లో 12 పరుగులు) స్టంపౌట్ అవటంతో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. ఆ వెంటనే గిల్ (18 బంతుల్లో 21) కూడా కున్హెమాన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. అనంతరం పుజారా (4 బంతుల్లో 1), రవీంద్ర జడేజా (9 బంతుల్లో 4) లను లియాన్ పెవిలియన్ చేర్చాడు. శ్రేయస్ అయ్యర్ కున్హెమాన్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో 45 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. 


ఈ దశలో విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 22), కేఎస్ భరత్ (30 బంతుల్లో 17)లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే కుదురుకున్నట్లే కనిపించిన ఈ జంటను కోహ్లీని ఔట్ చేయడం ద్వారా మర్ఫీ విడదీశాడు. ఆ వెంటనే భరత్ కూడా లియాన్ బౌలింగ్ లో వికెట్ ఇచ్చేశాడు. దీంతో లంచ్ సమయానికి భారత్ 7 వికెట్లకు 84 పరుగులు చేసింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ (13 బంతుల్లో 6), రవిచంద్రన్ అశ్విన్ (5 బంతుల్లో 1) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు తీసిన 7 వికెట్లు ఆసీస్ స్పిన్నర్ల ఖాతాలోకే చేరాయి. లియాన్, కున్హేమాన్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. మర్ఫీ ఒక వికెట్ తీశాడు. 


భారత తుది జట్టు 


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.


ఆస్ట్రేలియా తుది జట్టు 


ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్.