IND vs AUS 3rd Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 


'మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. మా డ్రెస్సింగ్ రూంలో వాతావరణం చాలా సానుకూలంగా ఉంది. మా బాయ్స్ వారి నైపుణ్యాలపై నమ్మకంగా ఉన్నారు. ఇలానే ముందుకు సాగుతాం. ఈ పిచ్ పై మేం చాలా క్రికెట్ ఆడాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉపరితలం కొంచెం భిన్నంగా ఉంది. పొడిగా కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకోవాలంటే ఈ గేమ్ గెలవడం మాకు ముఖ్యం. మొదటి 2 టెస్టుల్లో చేసిన ప్రదర్శననే పునరావృతం చేయాలని అనుకుంటున్నాం' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 


'పిచ్ పొడిగా కనిపిస్తోంది. రోహిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారిని త్వరగా ఆలౌట్ చేయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నాం. ఈ విరామం మాకు అవసరమైన సమయంలో వచ్చింది. గత మ్యాచ్ ఫలితం పట్ల మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. ఈ విరామాన్ని మా ఆటగాళ్లు బాగా ఉపయోగించుకున్నారు. తిరిగి సన్నద్ధం కావడానికి మాకు చాలా సమయం దొరికింది.' అని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమవటంతో.. ఈ మ్యాచ్ కు స్మిత్ సారథ్యం వహించనున్నాడు. 


భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. పేలవ ఫాంలో ఉన్న రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. అలాగే మహమ్మద్ షమీకు బదులు ఉమేష్ యాదవ్ కు చోటు దక్కింది. 


భారత తుది జట్టు 


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.


ఆస్ట్రేలియా తుది జట్టు 


ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), పీటర్ హ్యాండ్‌స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్.


పిచ్ రిపోర్ట్


ఇండోర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చిన్న బౌండరీలు ఉన్నాయి. వేగవంతమైన ఔట్ ఫీల్డ్ ఉంటుంది. ఈ పిచ్ కూడా తొలి 2 టెస్టుల్లోని పిచ్ లానే ఉంది. స్పిన్ కు బాగా సహకరించేలా కనిపిస్తోంది. వికెట్ పొడిగా, పగుళ్లు తేలి ఉంది. 


డబ్ల్యూటీసీ ఫైనల్


ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ టెస్ట్ గెలిస్తే మిగతా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అధికారికంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. డ్రా చేసుకున్నా భారత్ కు ఢోకా ఉండదు. అయితే ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలపై అది ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది.