IND vs AUS 2nd test: భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి సెషన్ లో టీమిండియాపై సంపూర్ణ మెజారిటీ కనబర్చిన ఆసీస్ జట్టు.. లంచ్ తర్వాతా అదే కొనసాగించింది. లంచ్ కు ముందు 4 వికెట్లు పడగొట్టిన కంగారూలు.. రెండో సెషన్ లో మరో 3 వికెట్లు తీశారు. దీంతో టీ బ్రేక్ వరకు టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్ (47 బంతుల్లో 28), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 11) క్రీజులో ఉన్నాయి. నాథన్ లియాన్ 5 వికెట్లు పడగొట్టాడు.
4 వికెట్లకు 88 పరుగులతో లంచ్ కు వెళ్లిన భారత జట్టు.. లంచ్ తర్వాతా తడబడింది. లంచ్ తర్వాత జడేజా, కోహ్లీలు బాగానే ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించాక మర్ఫీ బౌలింగ్ లో జడేజా (74 బంతుల్లో 26) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2 ఓవర్లకే కుదురుకుని ఆడుతున్న కోహ్లీని (84 బంతుల్లో 44) అరంగేట్ర బౌలర్ కున్హేమన్ ఎల్బీగా వెనక్కు పంపాడు. శ్రీకర్ భరత్ (12 బంతుల్లో 6) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ వికెట్ తో లియాన్ 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్ 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈసారి అక్షర్, అశ్విన్
అయితే భారత్ లోయరార్డర్ పవర్ ను చూపిస్తూ అశ్విన్, అక్షర్ లు నిలబడ్డారు. కుప్పకూలేలా కనిపించిన టీమిండియాను కొంతమేరకు గాడిలో పడేశారు. వీరిద్దరూ మొదట క్రీజులో నిలబడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పిచ్ పై అవగాహన వచ్చాక కున్హేమన్ బౌలింగ్ లో అశ్విన్ ఎదురుదాడికి దిగాడు. అతని బౌలింగ్ లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అశ్విన్, అక్షర్ లు 8వ వికెట్ కు ప్రస్తుతం 40 పరుగులు జోడించారు. ఈ జోడీ కుదురుకోవటంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 7 వికెట్లకు 179 పరుగులతో నిలిచింది. అయినప్పటికీ ఇంకా 84 పరుగులు వెనకబడే ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్; 142 బంతుల్లో 9x4) రాణించారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.