IND vs AUS 1st Test News Updates: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భారత జట్టు తగ్గేదే అంటోంది. మొదట అటు బౌలింగ్ లో సత్తాచాటిన భారత క్రికెట్ జట్టు, ఆపై బ్యాటింగ్‌లోనూ తమ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టులో కంగారు పెంచింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ సైతం కోల్పోకుండానే 172 పరుగులు చేసింది.
భారత్ కు 218 పరుగుల ఆధిక్యం
తొలి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకు ఆలౌటైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో ఏం చేస్తారా అనే డౌట్ వచ్చింది. కానీ తమదైనశైలిలో ఆడుతూ ఆసీస్ బౌలర్లను కంగారు పెట్టారు భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్. తొలి ఇన్నింగ్స్ లో లభించిన ఆధిక్యాన్ని భారీగా పెంచేసింది ఈ జోడీ. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 62 పరుగులతో నాటౌట్, జైస్వాల్ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ కు ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో చేసిన తప్పిదాల నుంచి నేర్చుకున్న భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్ లో ఆచితూడి ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ టెస్ట్ ఆడుతున్న జైస్వాల్ 123 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. అయితే అతడి కెరీర్ లో ఇదే స్లో హాఫ్ సెంచరీ. వేగం కంటే వికెట్లు నిలుపుకుంటూ పరుగులు సాధించాలన్న కసి యువ ఓపెనర్‌లో కనిపించింది.
2004 తరువాత ఆస్ట్రేలియా గడ్డమీద భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే తొలిసారి. 20 ఏళ్ల తరువాత కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఈ ఫీట్ నమోదు చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. దాంతో భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
104 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కు తెర
67/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్ మొదట్లోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓ దశలో ఆతిథ్య ఆస్ట్రేలియా 100 పరుగుల మార్క్ చేరుకుంటుందా అన్న అనుమానం కలిగింది. అయితే మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ కొద్దిసేపు పోరాడటంతో జట్టు వంద మార్క్ దాటింది. 10వ వికెట్‌కు స్టార్క్, హేజిల్ వుడ్ 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్ మొత్తంలో అత్యధికంగా 100 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ గా స్టార్క్ నిలిచాడు. హర్షిత్ రాణా బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు స్టార్క్ ప్రయత్నించగా చాలా ఎత్తుకు బంతి లేచింది. కీపర్ రిషబ్ పంత్ తాను తీసుకుంటానని చెప్పడంతో వేరే ఫీల్డర్ తప్పుకున్నాడు. పంత్ ఆ క్యాచ్ అందుకోగా, 104 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. డగౌట్ లో ఉన్న భారత క్రికెటర్ల కుటుంబసభ్యులు ఆ వికెట్ పడగానే సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్.