IND vs AUS 1st Test Australia Innings Highlights: ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను కేవలం 104 పరుగులకే అలౌట్ చేసి 46 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. మొదటి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులు చేసి అలౌట్ అయింది.   


పెర్త్ పిచ్‌ బౌలర్లకు స్వర్గధామంలా మారింది. మొదటి ఇన్నింగ్స్‌ ఇరు జట్ల బౌలర్లు సత్తా చాటారు. 104 పరుగులకే అలౌట్ అయిన ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ 2 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. ఇదే ఆ జట్టుకు వ్యక్తిగత అత్యధిక స్కోరు. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. 


7 వికెట్ల నష్టానికి 67 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆస్ట్రేలియా రెండో బ్యాటింగ్ మొదలు పెట్టింది. మొదట్లోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. 79 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. ఓ దశలో ఆస్ట్రేలియా వంద పరుగులైనా చేస్తుందా లేదా అన్న అనుమానం కలిగింది. అయితే ఆ దశలో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా కోసం గట్టిగా నిలబడ్డారు. వీళ్లిద్దరు 10వ వికెట్‌కు 25 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లద్దరూ కలిసి 110 బంతుల్ని ఎదుర్కొన్నారు. అంటే దాదాపు 20 ఓవర్లు బ్యాటింగ్ చేశారు.  ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడగొట్టాడు. 104 పరుగులు వద్ద స్టార్క్‌ను ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 


ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు కుడా ఫాస్ట్ బౌలర్లకే పడ్డాయి. భారత్ తరఫున స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా, ఆస్ట్రేలియా తరఫున స్పిన్నర్ నాథన్ లియాన్ 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ ఎంతగానో సహకరిస్తుందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.


తొలిరోజు 17 వికెట్లు పడ్డాయి
మ్యాచ్‌లో మొదటి రోజు మొత్తం 17 వికెట్లు పడిన సంగతి తెలిసిందే. తొలుత టీమ్ ఇండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తర్వాత తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. తొలిరోజు నుంచే మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. రెండు జట్లలోని బ్యాట్స్‌మెన్‌ ఫ్లాప్ అయ్యాయి.


భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన 
ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. 18 ఓవర్లు వేసిన బుమ్రా 30 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ 15.2 ఓవర్లలో 48 పరుగులు, సిరాజ్ 13 ఓవర్లలో 20 పరుగులిచ్చాడు.