IND vs AUS 1st Test News Live Updates |పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆస్ట్రేలియా విజయానికి 534 పరుగులు చేయాల్సి ఉంటుంది. భారత్ గెలవాలంటే ఆసీస్ ను ఆలౌట్ చేయాలి. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం ఆస్ట్రేలియా జట్టుకు అంత ఈజీ కాదు. భారత పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షిత్ రానా, మహ్మద్ సిరాజ్ లను ఎదుర్కొని అంత భారీ లక్ష్యాన్ని ఆసీస్ బ్యాటర్లు ఛేదిండం అసాధ్యమని చెప్పవచ్చు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 12 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ సెంచరీల మోత
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (161 పరుగులు: 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77 పరుగులు; 176 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. పరుగుల దాహంతో ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కోహ్లీ 100 పరుగుల మార్క్ చేరుకున్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 30వ సెంచరీ. ఆస్ట్రేలియా గడ్డమీద కోహ్లీకి ఇది 7వ టెస్టు సెంచరీ, కాగా పెర్త్ స్టేడియంలో రెండో శతకం. ఆసీస్ మీద టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (6) పేరిట ఉండేది. డాన్ బ్రాడ్‌మన్ 29 టెస్టు శతకాల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
రెండో రోజు ఆట ముగిసిన వెంటనే ఆటగాళ్లు మైదానం నుంచి బయటకు రాక ముందు కోహ్లీ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కు వెళ్లడాన్ని ఎవరూ మరిచపోలేరు. తనపై ఒత్తిడి పెరగడం, పరుగులు చేయాల్సిన బాధ్యత ఉందని కోహ్లీ ప్రాక్టీస్ కు వెళ్లాడని మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా డిక్లేర్ చేశాడు.
మిడిలార్డర్ సాయంతో ఇన్నింగ్స్ నడిపించిన కోహ్లీ
దేవదత్ పడిక్కల్ (25), వాషింగ్టన్ సుందర్ (29), నితీష్ కుమార్ రెడ్డి 38 నాటౌట్ గా నిలిచాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లను వేగంగా ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. భారత ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ చేసిన 200 పైచిలుకు భారీ భాగస్వామ్యం ఆసీస్ గడ్డమీద తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.