IND vs AUS Test: భారత పర్యటనలో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకూడదని ఆస్ట్రేలియా జట్టు నిర్ణయించుకుంది. బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది.ప్రస్తుతం బెంగుళూరు సమీపంలోని ఆలూర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది.
టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకూడదని తాము ఎందుకు నిర్ణయం తీసుకున్నామో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వివరణ ఇచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో తమకు గ్రీన్ వికెట్ ఇచ్చి.. అసలు టెస్ట్ మ్యాచుల్లో మాత్రం స్పిన్ పిచ్ లు ఇస్తారని స్మిత్ అన్నాడు. అలాంటప్పుడు ఇంక ప్రాక్టీస్ మ్యాచులు ఆడడం వల్ల ఉపయోగముండదని తెలిపాడు. అందుకే తమ నిర్ణయమే సరైనదని చెప్పాడు. '2017లో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇక్కడకు వచ్చినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ కోసం మాక్ గ్రీన్ పిచ్ ఇచ్చారు. అసలు టెస్టుకు వచ్చేసరికి అందుకు పూర్తి విరుద్ధంగా స్పిన్ పిచ్ లు ఎదురయ్యాయి. కాబట్టి ఈ సారి మేం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాం. అలాగే మా శిక్షణపై దృష్టిపెట్టాం. తద్వారా నెట్స్ లో ఎక్కువమంది స్పిన్నర్లను ఎదుర్కోవడం ద్వారా మమ్మల్ని మేం సిద్ధం చేసుకుంటున్నాం.' అని స్మిత్ వివరించాడు.
వారికిది అలవాటే
స్మిత్ వ్యాఖ్యలపై భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇలాంటి మైండ్ గేమ్ లు ఆడడం అలవాటే అని అశ్విన్ అన్నాడు. 'గత పర్యటనలో పుణె టెస్ట్ స్పిన్ కు ఎక్కువగా సహకరించింది. అయితే అందుకు మేం ఎలాంటి ప్రణాళికలు చేయలేదు. అయినా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడకపోవడం ఆసీస్ కు కొత్తేమీ కాదు. కొన్ని విదేశీ పర్యటనల్లో భారత్ కూడా ప్రాక్టీస్ మ్యాచులు ఆడలేదు. అంతర్జాతీయ షెడ్యూల్ దృష్ట్యా కొన్నిసార్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడడం కుదరదు.' అని యాష్ అన్నాడు.
ఈ సిరీస్ లో అశ్విన్ ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమిస్తోంది. యాష్ లాంటి బౌలింగ్ శైలి కలిగిన మహేష్ పిథియా అనే దేశవాళీ బౌలర్ ను రప్పించుకుని ప్రాక్టీస్ చేస్తోంది.
భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.