IND vs AUS 1st Test: ప్రస్తుతం క్రికెట్ లో చర్చంతా భారత్- ఆస్ట్రేలియా సిరీస్ దే. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా, భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవకపోవడం.. డబ్ల్యూటీసీ ఫైనలిస్టులను నిర్ణయించే సిరీస్ కావడం.. ఆసీస్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల కవ్వింపు మాటలు.. వెరసి ఈ సిరీస్ పై అందరి చూపు పడింది. ఇంకో 4 రోజుల్లో అంటే ఫిబ్రవరి 9న నాగ్ పూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టుకు టీమిండియాకు ఇంకో తలనొప్పి మొదలైంది. అదే తుది జట్టు ఎంపిక.
భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు తలనొప్పిగా మారింది. రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో సరైన ఆటగాళ్లను టీమిండియా ఎంచుకోవాలి. ముఖ్యంగా 5 విషయాల్లో ఎవరిని ఎంచుకోవాలో కత్తి మీద సాముగా మారింది.
- రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరు?
- పంత్ గైర్హాజరీలో కీపింగ్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు?
- శుభ్ మన్ గిల్ ఏ స్థానంలో ఆడతాడు?
- ఉమేష్ యాదవ్ లేదా జైదేవ్ ఉనద్కత్?
- అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్?
1. రోహిత్ శర్మతో ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్ కాగా.. శుభ్ మన్ గిల్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ ఫాం సరిగ్గా లేదు. మరోవైపు గిల్ 3 ఫార్మాట్లలోను పరుగుల వరద పారిస్తున్నాడు. కాబట్టి వీరిద్దరిలో ఎవరు ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారనేది టీం మేనేజ్ మెంట్ నిర్ణయించాలి.
2. వికెెట్ కీపింగ్ ఎవరు... రెగ్యులర్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదం కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం ముగ్గురు వికెట్ కీపర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. కేఎస్ భరత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్. ఇందులో కేఎస్ భరత్ వైపే భారత్ చూసే అవకాశం ఉంది. ఎప్పట్నుంచో అతను జట్టులో స్ఠానం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక రాహుల్ ఇప్పటివరకు టెస్టుల్లో పూర్తిస్థాయిలో కీపింగ్ చేయలేదు. ఇషాన్ కిషన్ కు అవకాశం రాకపోవచ్చు.
3. శుభ్ మన్ గిల్ ఎక్కడ ఆడతాడు.. ఒకవేళ ఓపెనర్ గా రాహుల్ ను తీసుకుంటే గిల్ ఎక్కడ ఆడతాడనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ కేఎస్ భరత్ ను జట్టులోకి తీసుకుంటే గిల్ కు చోటు దక్కకపోవచ్చు. గిల్ చేరికతో బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది కానీ దానికోసం ఒక స్పిన్నర్ లేదా పేసర్ ను తప్పించాలి. అది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది కూడా కోచ్, కెప్టెన్ గా సవాల్ గా మారనుంది.
4. ఉమేష్ లేదా జైదేవ్.. తొలి టెస్టులో ఇద్దరు పేసర్లుగా మహ్మద్ షమీ, సిరాజ్ ల స్థానం ఖాయమే. అయితే లెఫ్టార్మ్ పేసర్ జైదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్ లలో ఎవరిని తీసుకోవాలనేది ప్రశ్నగా మారింది. బుమ్రా గైర్హాజరీలో జట్టులో ఉన్న ఒకే ఒక స్వింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్. ప్రస్తుతం అతను టెస్టు క్రికెట్ లో ఫాంలోనే ఉన్నాడు. కొత్త బంతితో బాగా స్వింగ్ చేయగలడు. మరోవైపు దేశవాళీల్లో అదరగొట్టిన జైదేవ్ ఉన్నాడు. లెఫ్టార్మ్ పేసర్ కావడం అతని లాభం. మరి ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
5. అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్.. ప్రస్తుతం ఇంకో చర్చ అక్షర్ లేదే కుల్దీప్. వీరిద్దరిలో ఎవరిని ఆడించాలి. ఒకవేళ నాగ్ పుర్ పిచ్ స్పోర్టివ్ గా ఉంటే వీరిద్దరికీ చోటు ఉండదు. ఒకవేళ స్పిన్ పిచ్ అయితే అశ్విన్, జడేజాలకు తోడుగా ఎవరిని తీసుకోవాలనేది ప్రశ్న.