IND vs AUS, 1st T20: మొహాలిలో మోత మోగింది! స్టేడియంలో 360 డిగ్రీల్లో పరుగుల వరద పారింది. టీమ్‌ఇండియా తన దూకుడు అప్రోచ్‌నే కొనసాగించింది. ఒకరు పోతే ఇంకొకరు అన్నట్టుగా బ్యాటర్లు చెలరేగి ఆడటంతో తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాకు 209 పరుగుల భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. మొదట ఓపెనర్ కేఎల్ రాహుల్ (55; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్ యాదవ్ (46; 25 బంతుల్లో 2x4, 4x6) రెచ్చిపోతే ఆఖర్లో హార్దిక్ పాండ్య (71*; 30 బంతుల్లో 7x4, 5x6) మెరుపులు మెరిపించాడు.
వాహ్... కేఎల్ సూర్య!
కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవకపోవడంతో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. టీ20 ప్రపంచకప్ కోసం ఎప్పట్లాగే అటాకింగ్ అప్రోచ్‌ను కొనసాగించింది. వికెట్లు పోయినా డిఫెన్సివ్‌గా ఆడొద్దని నిర్ణయించుకుంది. తొలి 2 ఓవర్లలో ఎక్కువ పరుగులేం రాకపోవడంతో భారీ షాట్ ఆడబోయిన హిట్‌మ్యాన్ (11) జట్టు స్కోరు 21 వద్దే ఔటయ్యాడు. వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (2)ని లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపాతో ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఇబ్బంది పెట్టాడు. ఐదో ఓవర్లో అతడు ఊహించని షాట్‌తో ఔటయ్యాడు. 35-2తో ఇబ్బందుల్లో పడ్డ టీమ్‌ను కేఎల్ రాహుల్, సూర్యకుమార్ ఆదుకున్నారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగారు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు.
కుంగ్ ఫూ పాండ్య!
సొగసైన సిక్సర్లు, బౌండరీలతో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కేఎల్‌ను జట్టు స్కోరు 103 వద్ద హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. మరికాసేపటికే అర్ధశతకానికి చేరువైన సూర్యను గ్రీన్ పెవిలియన్‌కు పంపించాడు. మధ్యలో అక్షర్ పటేల్ (6), దినేశ్ కార్తీక్ (6) ఎక్కువ పరుగులేం చేయలేదు. వాళ్లు త్వరగా ఔటైనా హార్దిక్ పాండ్య మాత్రం మైదానంలో కుంగ్‌ఫూ చేశాడు. ఆత్మవిశ్వాసంతో మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఆఫ్‌సైడ్ జరిగి మరీ సిక్సర్లు బాదేశాడు. ఫ్రీ హ్యాండ్స్‌తో షాట్లు కొట్టాడు. 25 బంతుల్లోనే టీ20ల్లో రెండో అర్ధశతకం అందుకున్నాడు. ఆఖరి ఓవర్ మూడు బంతుల్ని హ్యాట్రిక్ సిక్సర్లుగా మలిచి జట్టు స్కోరును 208-6కు చేర్చాడు.