IND vs AUS 1st T20: భారత్‌, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్ టాస్‌ గెలిచాడు. వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టిమ్‌ డేవిడ్‌ అరంగేట్రం చేస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం ఈ సిరీసును ఉపయోగించుకుంటామని వెల్లడించాడు. మంచు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేశాడు. పిచ్‌ కాస్త హార్డ్‌, ఫ్లాట్‌గా ఉంటుందని వెల్లడించాడు. 


ప్రతి మ్యాచులో తమను పరీక్షించుకుంటామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఆరేడు నెలలుగా మ్యాచులను ఎలా గెలవాలో నేర్చుకున్నామని వెల్లడించాడు. ఆసియాకప్‌ పొరపాట్లను దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు. గాయాల కారణంగా కొందరు దూరమయ్యారని తెలిపాడు. బుమ్రా ఆడటం లేదని రెండో మ్యాచ్‌ నుంచి అందుబాటులో ఉంటాడని వెల్లడించాడు. అక్షర్‌, చాహల్‌ను తీసుకున్నామని, పంత్‌ ఆడటం లేదని స్పష్టం చేశాడు.


IND vs AUS Teams


టీమ్‌ఇండియా: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, ఉమేశ్ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌


ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌, కామెరాన్ గ్రీన్‌, స్టీవెన్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోష్‌ ఇన్‌గ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌, కమిన్స్‌, నేథన్‌ ఎల్లిస్‌, ఆడమ్‌ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌


ఎవరూ ఫర్‌ఫెక్ట్‌ కాదు


డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఎవరూ పర్ ఫెక్ట్ కాదని.. ప్రతిఒక్కరూ ఏదో ఒక అంశంపై దృష్టి సారిస్తున్నారని అన్నాడు. జట్టు గెలిచినప్పుడు ఎవరూ స్ట్రైక్ రేట్ గురించి పట్టించుకోరని తెలిపాడు. అయితే తాను స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టానని చెప్పాడు. జట్టులో ఎవరి రోల్ ఏమిటో వారికి స్పష్టంగా తెలుసునని.. అందరూ ఆ దిశగానే పనిచేస్తున్నారని వివరించాడు. తాను పూర్తి ఫిట్ గా ఉన్నానని.. స్వదేశంలో ఆసీస్ తో సిరీస్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాహుల్ తెలిపాడు. ఒక ఆటగాడికి.. తన కెప్టెన్, కోచ్ ఏమనుకుంటున్నారనేదే ముఖ్యమని.. బయటివారి వ్యాఖ్యలు తాము పట్టించుకోమని చెప్పాడు. ప్రతిసారి ఎవరూ విజయవంతం కారని అన్నాడు. తాము బాగా ఆడనప్పుడు అందరికంటే తమకే ఎక్కువ బాధ కలుగుతుందని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ గెలవడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు. 


కోహ్లీ గొప్ప ఆటగాడు


విరాట్ ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని ఫించ్ ప్రశంసించాడు. పదిహేనేళ్లుగా కోహ్లీ సాధించిన విజయాలు అతడినెప్పటికీ ఉత్తమంగా నిలబడతాయని కితాబిచ్చాడు. 71 సెంచరీలు కొట్టడమంటే మాటలు కాదని.. ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదని ఫించ్ అన్నాడు. అతడితో ఆడేటప్పుడు పక్కా ప్రణాళికతో వెళ్లాలని స్పష్టం చేశాడు. టీ20 క్రికెట్ కు అనుగుణంగా తనని తాను మలుచుకున్న విధానం ప్రశంసించ తగినదని అన్నాడు. అతడో గొప్ప ఆటగాడని అన్నాడు. 


నేను రెడీ!


దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని ఉమేశ్‌ యాదవ్‌ తెలిపాడు. అవకాశం వచ్చినప్పుడు తనవంతు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తాను టీ20 ఆడేందుకు సరిపడా ఫిట్ నెస్ తో ఉన్నట్లు స్పష్టం చేశాడు. మిడిల్ సెక్స్ తో క్రికెట్ ఆడడం వల్ల తాను ఫాంలోనే ఉన్నట్లు తెలిపాడు. కౌంటీ క్రికెట్ ను ఆస్వాదించానని.. ఇంగ్లండ్ లో వాతావరణం బాగుందని వివరించాడు.