వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ 20లో ఆస్ట్రేలియా బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ చెలరేగిపోయాడు. టీమిండియా యువ బౌలర్లను ఊచకోత కోస్తూ శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 10 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లిస్ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ చెలరేగిపోయాడు. అనుభవం లేని భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సులు , ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు.. అందిన బంతిని అందినట్లు ఉతికారేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే కంగారులు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ షార్ట్ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. 4.4ఓవర్లలో 31 పరుగులు సాధించారు. ఈ దశలో రవి బిష్ణోయ్ వేసిన ఓ అద్భుత బంతికి మ్యాథ్యూ షార్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 31 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్ కోల్పోయారు. ఆ తర్వాత నుంచే టీమిండియాకు అసలు కష్టాలు మొదలయ్యాయి. స్టీవ్ స్మిత్‌తో జత కలిసిన జోస్ ఇంగ్లిస్ భారత బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు దూసుకుపోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 11 ఓవర్లలోనే 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారంటే వీరిద్దరి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. స్టీవ్ స్మిత్ రనౌట్ రూపంలో వెనుదిరిగడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేసిన స్మిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
స్మిత్ వెనుదిరిగిన కాసేపటికే జోస్ ఇంగ్లిస్ సెంచరీ చేశాడు. 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 110 పరుగులు చేసిన ఇంగ్లిస్ స్కోరు వేగాన్ని మరింత పెంచే క్రమంలో అవుటయ్యాడు. ఇంగ్లిస్ తన సెంచరీని కేవలం 47 బంతుల్లోనే చేశాడు. అనంతరం మార్కస్ స్టోయినీస్... ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ హీరో ట్రానిస్ హెడ్ ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్టు 200 పరుగుల మార్కు దాటింది. ట్రానిస్ హెడ్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు. వీరి విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అయిదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా బౌలర్లు తేలిపోయారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే వికెట్ తీశాడు. రవి బిష్ణోయ్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ 4 ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖేష్ కుమార్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా యువ బ్యాటర్లు ఛేదిస్తారో లేదో చూడాలి.
ఈ సిరీస్‌లో సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లతో టీమిండియాలో యువ రక్తం ఉరకేలేస్తోంది. రింకూసింగ్ టీ 20 క్రికెట్‌లో రాణిస్తూ భవిష్యత్తు తారగా అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రపంచ కప్‌లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకోరు. జైస్వాల్, కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ఇలా ఏడుగురు లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు.