IND vs AFG Series: ఇటీవల కాలంలో  సంచలన ప్రదర్శనలతో   ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపునకు తిప్పుకుంటున్న అఫ్గానిస్తాన్.. త్వరలోనే భారత పర్యటనకు రానున్నది. ఐదేండ్ల  తర్వాత  టీమిండియాతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని  స్వయంగా బీసీసీఐ సెక్రటరీ  జై షా వెల్లడించాడు.  ఐపీఎల్-16లో తలమునకలైన  భారత క్రికెటర్లు.. ఈ లీగ్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఆడనున్నారు.  ఇది ముగిసిన  తర్వాత  భారత్‌కు వచ్చి ఆఫ్గాన్‌తో ఆడతారు.  అయితే ఇది ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) లో భాగంగా జరిగేది కాదని తెలుస్తున్నది.


జూన్ 7 నుంచి 12 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్స్  జరగాల్సి ఉంది. వాస్తవానికి ఇది ముగిసిన  తర్వాత భారత జట్టు   జులై వరకు ఖాళీగానే ఉంటుంది.   జులై  - ఆగస్టులో వెస్టిండీస్ తో  రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడేందుకు  కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంది. కానీ  డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ తర్వాత స్వదేశానికి వచ్చే భారత జట్టు ఖాళీగా  ఉండకుండా  ఈ సిరీస్ ఆడనున్నట్టు తెలుస్తున్నది.  ఈ సిరీస్‌కు సంబంధించిన  షెడ్యూల్ ఇంకా  వెలువడలేదు.  


రాబోయే ఐదేండ్ల కాలానికి గాను భారత జట్టు ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు  బీసీసీఐ త్వరలోనే మీడియా హక్కుల టెండర్ ను విడుదల చేయబోతుంది. 2018 నుంచి టీమిండియా‌కు  అధికారిక ప్రసారదారుగా ఉన్న స్టార్ ఒప్పందం    మార్చి నెలాఖరుతో ముగిసింది.  దీంతో కొత్త  టెండర్ ను త్వరలోనే  పిలువనున్నట్టు వెల్లడించే క్రమంలో  జై షా  అఫ్గాన్ సిరీస్ విషయాన్ని ప్రస్తావించాడు. 


కొత్త బ్రాడ్‌కాస్టర్..


స్పోర్ట్స్ స్టార్‌తో జై షా మాట్లాడుతూ.. ‘మీడియా హక్కుల టెండర్ జూన్ లేదా జులైలో విడుదలవుతుంది.   ఆఫ్గాన్ సిరీస్‌కు వేరుగా టెండర్లను పిలిచే అవకాశం ఉంది.  వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త మీడియా పార్ట్‌నర్ సైకిల్ మొదలవుతుంది. సెప్టెంబర్‌లో భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే  వన్డే సిరీస్ తో  ప్రారంభమవుతుంది..’అని  తెలిపాడు.  దీనిని బట్టి   ఆఫ్గాన్ సిరీస్ కోసం తాత్కాలిక బ్రాడ్‌కాస్టర్ ను తీసుకొచ్చే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది.  ఈ సిరీస్ ముగిసిన తర్వాత  సెప్టెంబర్ నుంచి 2028 వరకు  కొనసాగే బ్రాడ్‌కాస్టర్  ఎవరో  తర్వాత తేలనుంది.  


కాగా  2018 తర్వాత  అఫ్గాన్ జట్టు భారత పర్యటనకు రావడం ఇదే ప్రథమం.  ఆ ఏడాది అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు  టీమిండియాతో  బెంగళూరు వేదికగా  టెస్టు మ్యాచ్ ఆడింది. అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో ఇదే  మొదటి టెస్టు. ఆ తర్వాత  అఫ్గాన్ వివిధ వేదికలపై  భారత్ తో ఆడినా ఇక్కడికొచ్చి ముఖాముఖి తలపడలేదు.  ఇటీవల కాలంలో  ఆ  జట్టు  టీ20 స్టార్లతో దృఢంగా తయారైంది.  గత నెలలో రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆ జట్టు.. పాకిస్తాన్‌ను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో 2-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 


టీమిండియా అప్‌కమింగ్ షెడ్యూల్  (ఐపీఎల్ ముగిశాక): 


- జూన్ : డబ్ల్యూటీసీ ఫైనల్ 
- జూన్ : అఫ్గాన్‌‌తో వన్డే సిరీస్ (ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది) 
- జులై - ఆగస్టు : వెస్టిండీస్  పర్యటన (2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు) 
- సెప్టెంబర్ : ఆసియా కప్ (వేదికలు ఖరారు కావాల్సి ఉంది) 
- అక్టోబర్  - నవంబర్ : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్,  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 
- డిసెంబర్ - సౌతాఫ్రికా టూర్