వరల్డ్ కప్‌లో టీమిండియా దూసుకుపోతుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలవడం ద్వారా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో న్యూజిలాండ్ టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. 


భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా హిట్ మ్యాన్‌కే లభించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (55 నాటౌట్: 56 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో హష్మతుల్లా షాహిది (80: 88 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజ్మతుల్లా ఒమర్‌జై (62: 69 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) హాఫ్ సెంచరీ కొట్టాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రెండు వికెట్లూ రషీద్ ఖాన్‌కే దక్కాయి.


చాన్నాళ్లకు హిట్ మ్యాన్‌లా కనిపించిన రోహిత్
273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (47: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్లపై ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ ఒకడివే 76 పరుగులు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 10 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిత్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో.


ఆ తర్వాత ఇషాన్ కిషన్ టచ్‌లోకి వచ్చాడు. బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్ సెంచరీ పూర్తయింది. వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన శతకం. మొదటి వికెట్‌కు 156 పరుగులు జోడించిన అనంతరం ఈ జోడిని రషీద్ ఖాన్ విడదీశాడు. ఇషాన్ కిషన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న ఇబ్రహీం జద్రాన్ చేతిలో పడింది. దీంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.


అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో (25 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి విరాట్ మ్యాచ్‌ను ముగించాడు.


నాలుగు వికెట్లతో చెలరేగిన బుమ్రా
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. టీమ్‌ఇండియా పేసర్లు చురకత్తుల్లాంటి బంతులు వేయడంతో ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌ (21: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఇబ్రహీం జద్రాన్‌ (22: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు) నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో జద్రాన్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. సరిగ్గా ఆరు ఓవర్ల తర్వాత గుర్బాజ్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రెహ్మత్‌ (16: 22 బంతుల్లో, మూడు ఫోర్లు) శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు.


63 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ అఫ్ఘనిస్తాన్‌‌ను షాహిది (80: 88 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), ఒమర్‌జాయ్‌ (62: 69 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 128 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీమ్‌ఇండియా బౌలర్లను ఆచితూచి జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. అలాగే చక్కని బౌండరీలు బాదేశారు. వీరిద్దరి ఆటతీరుతోనే అఫ్గాన్‌ రెండో పవర్‌ప్లేలో మూడు వికెట్లు నష్టపోయి 163 పరుగులు సాధించింది. ఒమర్‌ జాయ్‌ 62, షాహిది 58 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు అందుకున్నారు. దీంతో అఫ్గాన్‌ స్కోర్‌ 36.4 ఓవర్లకు 200కు చేరింది. జట్టు స్కోరు 184 వద్ద ఒమర్‌జాయ్‌ను హార్దిక్ పాండ్యా బౌల్డ్‌ చేశాడు. 225 పరుగుల వద్ద షాహిదిని కుల్‌దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నెమ్మదిగా ఆడటంతో అఫ్ఘనిస్తాన్‌ 272/8కి పరిమితమైంది.