అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జరిగిన నామమాత్రమైన మూడో టీ 20లో టీమిండియా (Team India)ఘన విజయం సాధించింది. రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో చివరికి విజయం భారత్‌నే వరించింది. తొలుత రోహిత్‌- రింకూ(Rohit-Rinku) పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అఫ్గాన్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 212 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. అనంతరం సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అది కూడా టై అయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 16 పరుగులు చేయగా భారత్‌ కూడా 16 పరుగులే చేసింది. మరోసారి సూపర్‌ ఓవర్‌ పెట్టగా టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ బ్యాటర్లను రవి బిష్ణోయ్‌ అవుట్ చేశాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్‌ కథ ముగిసింది. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసినట్లే. అందుకే మరో మూడు బంతులు మిగిలి ఉండగానే అఫ్గాన్‌ కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే అవుటైన విరాట్‌ కోహ్లీ అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.

 

తొలిసారి ఇలా...

అఫ్గాన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి విరాట్‌ కోహ్లీ అవుట్యయాడు. ఎదుర్కొన్న తొలి బంతినే పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా కోహ్లీ గోల్డెన్‌ డక్‌ నమోదు చేశాడు. కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకూ  ఎప్పుడూ ఇలా ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటవ్వలేదు. కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్‌ కోహ్లి అవుట్‌ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. 

 

భారత జట్టు కొత్త చరిత్ర 

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.

 

రోహిత్-రింకూ చరిత్ర

అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో... టీమిండియా సారధి రోహిత్‌శర్మ-నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ కొత్త రికార్డు సృష్టించారు. అఫ్గాన్‌ బౌలర్లను చీల్చి చెండాడిన వీళ్లిద్దరూ అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.  ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ నెలకొల్పిన అజేయమైన 190 పరుగుల భాగస్వామ్యం... అంతర్జాతీయ టీ20లలో భారత్‌కు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. 190 పరుగుల భాగస్వామ్యంతో రోహిత్‌-రింకూ టీ 20 క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడిగా చరిత్ర సృష్టించారు.