Hat-trick of c Rohit b Prasidh | చెన్నై: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ చెన్నైలో అరుదైన ఘటన జరిగింది. చేపాక్ స్టేడియంలో అఫ్గాన్ జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. అసలే విపరీతమైన ఎండ, మరోవైపు భారత పేసర్ నిప్పులు చెరగడంతో అఫ్గానిస్తాన్ టాపార్డర్ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా తమ వికెట్లను కోల్పోయారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణల మధ్య సమన్వయంతో అరుదైన రికార్డ్ నమోదైంది.
హ్యాట్రిక్ సాధించిన రోహిత్, ప్రసిద్ధ్వాస్తవానికి అఫ్గానిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాటర్ల వికెట్లను భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పడగొట్టాడు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురు బ్యాటర్ల క్యాచ్‌లు రోహిత్ శర్మ పట్టాడు. క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకే బౌలర్ బౌలింగ్‌లో (వికెట్ కీపర్ కాకుండా) ఒకే ఫీల్డర్ వరుసగా 3 క్యాచ్‌లు అందుకోవడం విశేషం. అది కూడా భారత్ తరఫున వన్డేలు ఆడుతున్న అతిపెద్ద వయస్కుడిగా ఉన్న రోహిత్ శర్మ ఏమాత్రం తప్పిదం చేయకుండా ఫీల్డింగ్‌లో చురుకుగా వ్యవహరించి ఆ క్యాచ్‌లు అందుకోవడం విశేషం.
ఇన్నింగ్స్ రెండో ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. మొదటి బంతికే ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్‌ను 5 పరుగుల స్కోరు వద్ద రోహిత్ శర్మ చేతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చేలా చేశాడు. ఆ తర్వాత 6వ ఓవర్ చివరి బంతికి ప్రసిద్ధ్ బౌలింగ్ లో రహ్మత్ షా ఔటయ్యాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ వేగంగా స్పందించి క్యాచ్ అందుకోవడంతో రహ్మత్ షా నిరాశగా వెనుదిరిగాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ, రోహిత్ శర్మ కాంబో మరోసారి మ్యాజిక్ చేసింది. ఈసారి కూడా బౌలర్ ప్రసిద్ధ్, కానీ బ్యాటర్ మారాడు. 11 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ ఆడిన బంతిని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ క్యాచ్ పట్టడంతో టీమిండియా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ప్రసిద్ద్ కృష్ణ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశారు.
ఈ 3 వికెట్లతో రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ రికార్డు పుస్తకాల్లో తమ పేరును లిఖించుకున్నారు. ప్రత్యర్థి జట్టులోని మొదటి ముగ్గురు బ్యాటర్ల ఔట్‌లలో భాగస్వామ్యం పంచుకున్న నాల్గవ భారత ఆటగాడిగా (రోహిత్) నిలిచాడు. అంతకుముందు టీమిండియా నుంచి సౌరవ్ గంగూలీ (2002), మనోజ్ తివారీ (2011), సురేష్ రైనా (2013) ఈ ఘనత సాధించారు.
అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే బౌలర్ బౌలింగ్‌లో 3 క్యాచ్‌లు పట్టిన మూడో భారత ఫీల్డర్‌గా రోహిత్ నిలిచాడు. అంతకుముందు 2004లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వివిఎస్ లక్ష్మణ్ ఇదే తరహాలో 3 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తరువాత 2018లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్ ఇదే తీరుగా మూడు క్యాచ్‌లు పట్టి అరుదైన జాబితాలో చేరాడు.
