సిరీస్‌ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన సఫారీ జట్టు.. ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు... 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 42.3  ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్‌ బ్యాటర్లలో టోనీడీ జార్జీ అద్భుత శతకంతో ప్రొటీస్‌కు విజయాన్ని అందించాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్‌, కెప్టెన్ రాహుల్‌ మెరిశారు.  అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో సాయి సుదర్శన్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా సాయి రికార్డు సృష్టించాడు. అంతకుముందు నవజోత్ సింగ్ సిద్ధూ పేరిట ఈ రికార్డు ఉంది. 1987లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిద్ధూ.. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచులో 73, రెండో మ్యాచులో 75 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత ఈ రికార్డును తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ సాధించాడు.


జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌  తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో అదరగొట్టాడు. తొలి వన్డేలో సాయి.. 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు.  తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్‌ సెంచరీ సాధించిన 17వ బ్యాటర్‌గా తన పేరు లిఖించుకున్నాడు.  తొలి వన్డే ఆడుతూ ఓపెనర్‌గా అర్ధ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్‌గానూ రికార్డు సృష్టించాడు. గతంలో రాబిన్‌ ఊతప్ప, కెఎల్‌ రాహుల్‌, ఫియాజ్‌ ఫజల్‌లు ఆడిన తొలి వన్డేలోనే  అర్ధ శతకం సాధించిన ఓపెనర్లుగా రికార్డు నెలకొల్పారు. ఆ జాబితాలో తాజాగా సాయి సుదర్శన్‌ చేరాడు.  
 తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన సాయి సుదర్శన్‌ రెండో వన్డేలోనూ మరోసారి మెరిశాడు. తిలక్‌ వర్మ... కెప్టెన్‌ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న సాయి సుదర్శన్‌... ఆ తర్వాత సాధికార బ్యాటింగ్‌ చేశాడు. 10 పరుగులు చేసిన తిలక్‌ను బర్గర్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రాహుల్‌-సాయి సుదర్శన్‌ టీమిండియా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 


ముఖ్యంగా సాయి సుదర్శన్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత కాసేపటికే సాయి సుదర్శన్‌ అవుటయ్యాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ను.... విలియమ్స్‌ అవుట్‌ చేశాడు.