Rohit Sharma Aggressive Batting: టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్‌కు, వన్డే సిరీస్‌లో శ్రీలంక(Sri Lanka) గట్టి పోటీనిచ్చింది. తొలి వన్డేలో గట్టి దెబ్బ కొట్టిన శ్రీలంక రెండో మ్యాచ్‌లో గెలిచి అదరగొట్టింది.  భారీ విజయంసాధిస్తుందనుకున్న  టీమ్‌ఇండియా(India) ఒక్కసారిగా  పడిపోవటం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది.


అయితే మ్యాచ్ ఏదైనా గానీ  టీమిండియా సారధి  రోహిత్ శర్మ బ్యాటింగ్‌ విధానం మాత్రంమారదు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడం, సునాయాసంగా  వారిని ఒత్తిడికి గురిచేసి  భారత్‌కు బలమైన  పునాదిని నిర్మించడం హిట్ మ్యాన్ స్టైల్ . అయితే  దూకుడుగా ఆడే క్రమంలో ఒక్కోసారి రోహిత్‌ శర్మ షాట్‌ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి.  అయితే ఈసారి వీటిపై  హిట్‌మ్యాన్‌ స్పందించాడు. ఎలాంటి పరిస్థితిలో అయినా తాను రిస్క్‌ తీసుకోవడానికి  భయపడనని తేల్చి చెప్పాడు.  దూకుడుగా ఆడి సెంచరీ చేసినా... హాఫ్ సెంచరీ చేసినా.. డెక్  అవుటైనా తన విధానం మాత్రం మారదని కుండబద్దలు కొట్టాడు.

 

రఫ్ఫాడించేశాడు.. కానీ 

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో హిట్‌ మ్యాన్‌ కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. రోహిత్‌ దూకుడుతో భారత జట్టు  దశలో  సునాయాసంగా గెలిచేస్తుంది అనిపించింది.   అయితే వాండర్సే బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడిన రోహిత్‌.. పాతుమ్ నిస్సాంకకు క్యాచ్‌ ఇచ్చి  పెవిలియన్ చేరాడు. రోహిత్‌ ఇలా అవుటైన తర్వాత విమర్శలు వచ్చాయి. రోహిత్‌  పరమ చెత్త షాట్‌ ఆడి అవుటయ్యాడని  విమర్శించారు. దీనిపై రోహిత్‌ శర్మ స్పందించాడు.  అసలు తాను  64 పరుగులు చేశాడంటే దానికి కారణం తాను బ్యాటింగ్ చేసిన విధానమే అన్నాడు. తాను అలా బ్యాటింగ్ చేసినప్పుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందనీ, కానీ  రిస్క్‌ తీసుకోవడానికి అసలు ఎప్పుడూ భయపడనన్నాడు. తాను  సెంచరీ  చేసినా.. 50 చేసినా లేదా సున్నాకే అవుటైనా సరే మీరు  అనుకున్న లక్ష్యాన్ని చేరకపోతే  మీరు నిరాశ చెందుతూనే ఉంటారన్నాడు. అయితే ఎదుటి వారి నిరాశ  తనను గానీ, తను ఆడే విధానాన్ని గానీ  మార్చదని స్పష్టం చేశాడు. తాము  మంచి క్రికెట్ ఆడలేదు, అందుకే ఓడిపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్ తో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 300 సిక్స్‌లను కొట్టిన బ్యాటర్ల జాబితాలోకి చేరుకున్నాడు. 

 

పిచ్‌ను అర్థం చేసుకోవాలి.. 

రెండో వన్డే  మ్యాచ్‌లో ఒకటి కాదు చాలా తప్పులు చేశామని రోహిత్‌ శర్మ అంగీకరించాడు.   మ్యాచ్‌లను గెలవాలంటే స్థిరమైన ఆట ఆడాలి.  ఈ మ్యాచ్ లో తాము ఆ పని చేయడంలో, పిచ్ ను అర్థం చేసుకోవడంతో  విఫలమయ్యామన్నాడు. . లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌లో స్ట్రైక్‌ రొటేట్‌ అవుతుందని తాము భావించామని,  కానీ అది జరగలేదన్నాడు.  అలాగే మ్యాచ్ మొదట్లో చూపించిన దూకుడు మిడిల్ ఆర్డర్ కూడా కొనసాగించి ఉంటే బాగుండేదన్నాడు. అయినా సరే జరిగిపోయిన ఆట గురించి, దాని  తీరు గురించి  తాము  అతిగా ఆలోచించమని, అయితే మధ్య ఓవర్లలో తమ  బ్యాటింగ్‌పై మాత్రం చర్చించుకుంటామన్నాడు.  ఇక శ్రీలంక విషయానికి వస్తే జట్టు  విజయంలో జెఫ్రీ వాండర్సేకే  ఎక్కువ క్రెడిట్ దక్కుతుందన్నాడు.