Womens World Cup 2025 | ICC మహిళల ప్రపంచ కప్‌లో అసలు సిసలైన పోరు జరుగుతోంది. పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు సాధించింది. హర్లీన్ డియోల్ (46), చివర్లో రీచా గోష్ ( 20 బంతుల్లో 35 నాటౌట్) రాణించారు. భారత పురుషుల జట్టు ఇటీవల ఆసియా కప్ లో ఏం చేసిందో మహిళా జట్టు అదే చేసింది. టాస్ సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి భారత ప్లేయర్లు ఇలా బదులు తీర్చుకుంటున్నారు.
కొంతమంది మినహా బ్యాటర్లు ఎవరూ అంత సౌకర్యంగా కనిపించలేదు. పాక్ బౌలింగ్ యూనిట్ గతంలోలాగ స్ట్రాంగ్ లేకున్నా భారత ప్లేయర్లు పరుగులు చేయడంలో ఇబ్బండి పడ్డారు. పటిష్ట భారత బ్యాటర్లను పాక్ బౌలర్లు ఇన్నింగ్స్‌లో ఎక్కువగా సింగిల్స్ కే పరిమితం చేశారు. భారత్ మోస్తరు స్కోరు చేయడంతో వరల్డ్ కప్ ఈవెంట్లలో 11-0 రికార్డు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి.
భారత టాప్ ఆర్డర్ సమస్యలు
ఇది ICC మహిళల ప్రపంచ కప్‌లో భారత్ రెండవ మ్యాచ్ లో వారి టాపార్డర్ మరోసారి మంచి ఆరంభాన్ని అందించడంలో విఫలమైంది. స్మృతి మంధానా, ప్రతికా రావల్ మొదట మంచి టచ్‌లో కనిపించారు, కాని పవర్ ప్లేలోనే స్కోరింగ్ రేటు తగ్గింది. మొదట వారు టైమింగ్ కోసం కష్టపడ్డారు. చివరికి మంధానా 32 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటైంది. హర్లీన్ డియోల్ మరోసారి 50 పరుగుల మార్క్ చేరుకోలేకపోయింది. 46 పరుగుల వద్ద రహీం షాహిం బౌలింగ్ లో అవుట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 19 పరుగులు చేసి నిరాశపరిచింది.
గత మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో హీరోగా నిలిచిన అమన్‌జోత్ కౌర్‌ను నేటి మ్యాచ్‌కు తీసుకోలేదు, దాంతో బాధ్యత స్నేహ్ రానా , దీప్తి శర్మలపై ఉంది. పాకిస్తాన్ బౌలర్లు భారత్ ను గట్టిగానే కట్టడి చేశారు. దీప్తి శర్మ (25), స్నేహ్ రానా 20 పరుగులు చేసి ఔటయ్యారు. రిచా ఘోష్ చివరిలో మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత్ నిర్ణీత ఓవర్లలో 247 స్కోరుకు ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లలో దియానా బేగ్ 4 వికెట్లు పడగొట్టింది. సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో 2 వికెట్లు తీశారు. రహీం షామిమ్, నష్రా సంధులకు చెరో వికెట్ దక్కింది. షాతిమా సనా 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి కేవలం 38 పరుగులు ఇచ్చి ఆకట్టుకుంది.