Australia secures victory by 9 runs Vs India: ఆస్ట్రేలియా(Australia) చేతిలో మరోసారి టీమిండియా(India)కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్‌ వరకూ పోరాడినా.. కంగారుల పట్టుదల ముందు హర్మన్ సేన తలవంచక తప్పలేదు. కెప్టెన్ హర్మన్‌(Harman) అర్ధ శతకంతో చివరి వరకూ పోరాడింది. అయినా అవతలి బ్యాటర్ల నుంచి చివర్లో సరైన సహకారం లభించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 142 పరుగులకే పరిమితమైంది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. 





రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. కంగారు జట్టుకు మంచి ఆరంభం దక్కలేదు. 17 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రేణుకా సింగ్ వరుస బంతుల్లో రెండు వికెటట్లు తీసి కంగారులను దెబ్బకొట్టింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా దూకుడుగా ఆడడంతో కంగారు రన్‌ రేట్‌ ఎక్కడా తగ్గలేదు. ఓపెనర్‌ గ్రేస్ హారీస్ 40,  కెప్టెన్ తహీలా మెక్‌గ్రాత్ 32, ఎలీస్ పెర్రీ 32 పరుగులతో రాణించారు. వరుసగా వికెట్లు పడుతున్నా కంగారు బ్యాటర్లు దూకుడుగా ఆడడం మాత్రం వీడలేదు. దీంతో ఆస్ట్రేలియా రన్‌ రేట్ ఏడు పరుగులకు తగ్గలేదు. తొలుత వికెట్లు తీసినా తర్వాత కంగారు బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుగా సింగ్, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. 

 





పోరాడినా..

152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ గట్టిగానే పోరాడింది. ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడుగా ఆడగా... స్మృతి మంధాన మాత్రం తడబడింది. షెఫాలీ వర్మ 13 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి అవుటైంది. మరోవైపు స్మృతి మంధాన మాత్రం బాగా తడబడింది. 12 బంతులు ఆడిన మంధాన.. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటైంది. తర్వాత జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ భారత్‌ను విజయం దిశగా నడిపించారు. జెమీమా 12 బంతుల్లో 16 పరుగులు చేసి అవుటైంది. కానీ హర్మన్ ప్రీత్ మాత్రం వదల్లేదు. చివరి ఓవర్‌ వరకూ పోరాడింది. కానీ మిగిలిన బ్యాటర్లు సరైన సహకారం అందిచలేదు. హర్మన్ 47 బంతుల్లో  ఆరు  ఫోర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.  దీప్తి శర్మ 25 బంతుల్లో 29 పరుగులు చేసి దూకుడుగా ఆడింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ సరిగ్గా ఆడలేదు. ఈ ఓటమితో భారత్ సెమీస్‌ ఆశలు దాదాపుగా మూసుకుపోయాయి. సోమవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో కివీస్‌ ఓడిపోతే భారత్‌కు అవకాశాలు ఉంటాయి. కానీ బలమైన కివీస్‌ను.. పాక్‌ అడ్డుకోవడం అంత సులభం కాదు.