Ravichandran Ashwin maintains top spot in ICC Test Rankings: టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 853 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ పేసర్‌ కగిసొ రబాడా రెండో స్థానంలో ఉండగా ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌ మూడో స్థానం దక్కించుకున్నాడు. భారత పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో నిలిచాడు. 



టాప్‌టెన్‌లో కోహ్లీ ఒక్కడే...
బ్యాటింగ్‌ విభాగం ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ( (Virat Kohli) ఒక్కడే టాప్‌-10లో( (Indian In Top 10 Batters) నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై 767 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌.. నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలుపుకున్నాడు. కేన్‌ మామ తర్వాత ఇంగ్లండ్‌కే చెందిన జో రూట్‌, ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కివీస్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ డారెల్‌ మిచెల్‌ నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు.  భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసిన ఓలీపోప్‌ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు.  హైదరాబాద్‌ టెస్టుకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న పోప్‌.. 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. పోప్‌కు కెరీర్‌లో ఇదే బెస్ట్‌ ర్యాంకు కావడం గమనార్హం. టాప్‌ -10లో కోహ్లీ మినహా మరెవరూ భారత బ్యాటర్లు లేరు. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 12వ ర్యాంకులో ఉండగా రిషభ్‌ పంత్‌ 13వ స్థానంలో ఉన్నాడు. టెస్టు ఆల్‌ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 425 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 328 పాయింట్లతో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అక్షర్‌ పటేల్‌ ఆరో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు తలా 117 పాయింట్లతో సమానంగా ఉన్నా ఆసీస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ రెండో స్థానంలో ఉంది. 115 పాయింట్లతో ఇంగ్లండ్‌ మూడో స్థానంలో ఉంది. వన్డే, టీ20లలో మాత్రం భారత్‌దే అగ్రస్థానం.



రెండో టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తి
విశాఖ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీ నుంచి భారత్‌– ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్ల వివరాలను ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి మీడియాకు బుధవారం వెల్లడించారు. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరో తేదీ వరకు రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు ఓటమిపాలు కావడంతో రెండో టెస్ట్ భారత జట్టుకు కీలకంగా మారింది. దీంతో ఈ టెస్టు చూసేందుకు వస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతుందని బిసిసిఐ అంచనా వేస్తోంది. అభిమానుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 15 వేలు, ఆఫ్‌లైన్‌లో 5 వేల వరకు టికెట్లు విక్రయించినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు.