ICC Test Ranking: 2023: మార్చి 18.. ఇంచుమించుగా మరో పన్నెండు రోజులు గడిస్తే నాలుగు నెలలు. ఈ నాలుగు నెలలలో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టింది లేదు.  మ్యాచ్ లు కూడా ఆడలేదు. అయినా  టెస్టులలో  పరుగుల వరద పారిస్తున్న బ్యాటర్ల కంటే  మిన్నగా  న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్..  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఐసీసీ తాజాగా విడుదల చేసిన  టెస్టు  ర్యాంకింగ్స్ (బ్యాటింగ్) లో మొదటి స్థానంలో నిలిచింది కేన్ మామనే కావడం గమనార్హం.   యాషెస్ లో  ఆడుతున్న స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, జో రూట్ వంటి ఆటగాళ్లు కూడా  విలియమ్సన్ తర్వాతి స్థానాల్లోనే ఉన్నారు.  


ఎలా..? 


ఈ ఏడాది మార్చిలో  స్వదేశంలో శ్రీలంకంతో జరిగిన   రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ డబుల్  సెంచరీ (215) సాధించాడు. ఇదే  సిరీస్ లో కేన్ మామ ఫస్ట్ టెస్టులో  సెంచరీ కూడా చేశాడు. దీంతో అతడికి  మంచి రేటింగ్ పాయింట్స్ దక్కాయి. ఇదే క్రమంలో మొన్నటిదాకా వరల్డ్ నెంబర్ బ్యాటర్ గా ఉన్న మార్నస్ లబూషేన్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ తో పాటు యాషెస్ లో కూడా విఫలమయ్యాడు.   


జో రూట్,  స్టీవ్ స్మిత్ లు  ఆడుతున్నా  పాయింట్ల పరంగా వాళ్లు ర్యాంకులలో హెచ్చుతగ్గులున్నాయి.  తాజా ర్యాంకుల ప్రకారం కేన్ మామకు 883 రేటింగ్ పాయింట్స్ ఉండగా  రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్  కు 882 పాయింట్స్ ఉన్నాయి.  లబూషేన్ (3వ స్థానం) కు 873, నాలుగో  స్థానంలో ఉన్న ట్రావిస్ హెడ్ కు 872 పాయింట్స్ ఉండగా గత వారం టాప్ - 1లో ఉన్న  జో రూట్ (ఇంగ్లాండ్) లార్డ్స్ టెస్టులో విఫలమవడంతో నాలుగు స్థానాలు కోల్పోయి 866 పాయింట్స్ తో ఐదో స్థానంలో నిలిచాడు. 2021 ఆగస్టు తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ - 1 ప్లేస్ కు  చేరడం కేన్ విలియమ్సన్ కు ఇదే ప్రథమం కావడం గమనార్హం. 


 






టాప్ - 10లో నలుగురు వాళ్లే.. 


ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో కంగారూల హవా కొనసాగుతోంది. 2,3,4 స్థానాల్లో స్మిత్, లబూషేన్, ట్రావిస్ హెడ్ ఉండగా  ఏడో స్థానంలో ఉస్మాన్ ఖవాజా కొనసాగుతున్నాడు. టాప్ - 10లో వాళ్లే నలుగురు బ్యాటర్లు ఉండటం గమనార్హం. భారత జట్టు  నుంచి టాప్ - 10 జాబితాలో  రిషభ్ పంత్ ఒక్కడే  ఉన్నాడు. పంత్.. 758 రేటింగ్ పాయింట్స్ తో   పదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (12), విరాట్ కోహ్లీ (12) లు  టాప్ - 15 లో కొనసాగుతున్నారు.  


స్మిత్ కు అవకాశం.. 


ఈ వారం  కేన్ మామ  నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నా అది ఎక్కువకాలం కొనసాగదు. లార్డ్స్ టెస్టులో స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. దీంతో అతడి రేటింగ్ పాయింట్స్ కూడా భారీగానే పెరిగాయి. వచ్చే వారం  స్మిత్.. నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి.  


ఇక బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 860 రేటింగ్ పాయింట్స్ తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా ఆసీస్ సారథి పాట్ కమిన్స్,  సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడా , ఇంగ్లాండ్ పేసర్లు జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా  లు 8,9 ప్లేస్ లో నిలిచారు. 






Join Us on Telegram: https://t.me/abpdesamofficial