ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ దశలో ఉంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ప్రాక్టీసులో మునిగి తేలుతున్నాయి. ఈ నాలుగింటిలో రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. అయితే భారత్ ఇప్పటికే ఆఖరి పోరుకు అర్హత సాధించినట్లు మన అభిమానులు ఊహించుకుంటున్నారు.  క్రికెట్ లో ప్రతి చిన్న విషయాన్ని గమనించే భారత అభిమానులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లందరూ ఇప్పుడు టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు వెళ్లిందనే ఊహలో ఉన్నారు.  అందుకు కారణం అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో.


రిచర్డ్.. బ్యాడ్ లక్


అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. ఇతనికి, టీమిండియాకు విడదీయలేని అనుబంధం ఉంది. భారత్ ఆడిన చాలా మ్యాచులకు అతను అంపైరింగ్ చేశాడు. అయితే ఆ మ్యాచుల్లో చాలా వాటిలో టీమిండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ముఖ్యంగా రిచర్డ్ అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచుల్లో ఫలితాలు భారత్ కు ప్రతికూలంగా వచ్చాయి. 2014 టీ20 ప్రపంచకప్ మొదలుకుని గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దాకా.. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా నాకౌట్ దశకు వెళ్లిన ప్రతి మ్యాచులోనూ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. బ్యాడ్ లక్కో మరేంటో తెలియదు కానీ.. ఈ మ్యాచులన్నీ భారత్ ఓడిపోయింది. 


కెటిల్ బరో అంపైరింగ్ చేసి భారత్ ఓడిపోయిన మ్యాచులు



  • 2014 శ్రీలంకతో టీ20 ప్రపంచకప్ ఫైనల్

  • 2016 వెస్టిండీస్ తో టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్

  • 2017 పాకిస్థాన్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

  • 2019 న్యూజిలాండ్ తో వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్.


 ఈ మ్యాచ్ అయితే అంత త్వరగా మరచిపోలేం. ఆఖర్లో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు ధోనీ రనౌట్ నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లింది. ఈ అంపైర్ కెటిల్ బరోనే. ఆ సమయంలో అతను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి. 


ఈ మ్యాచులన్నింటిలో భారత్ పరాజయం పాలైంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో గురువారం టీమిండియా, ఇంగ్లండ్ తో సెమీఫైనల్ లో తలపడనుంది. తాజాగా ఆ మ్యాచులకు ఐసీసీ ప్రకటించిన అంపైర్లలో రిచర్డ్ కెటిల్ బరో పేరు లేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా కుమార ధర్మసేన, పాల్ రీఫిల్.. థర్డ్ అంపైర్ గా క్రిస్ గ్యాఫనీ.. ఫోర్త్ అంపైర్ గా రాడ్ టకర్ వ్యవహరించనున్నారు. టీమిండియాకు బ్యాడ్ లక్ గా పేరు తెచ్చుకున్న కెటిల్ బరోకు ఈ లిస్టులో చోటు దక్కకపోవటంతో భారత అభిమానులు ఆనందపడుతున్నారు. భారత్ సెమీఫైనల్ మ్యాచులో రిచర్డ్ అంపైర్ గా లేకపోవటంతో.. అభిమానులు సెంటిమెంట్ పేరుతో ఇప్పటికే టీమిండియా కచ్చితంగా ఫైనల్ కు వెళుతుందని నమ్ముతున్నారు. ఒకవేళ అదే నిజమై భారత్ ఫైనల్ కు వెళితే అక్కడ కూడా ఈ అంపైర్ రాకూడదని కోరుకుంటున్నారు. చూద్దాం.. అభిమానుల సెంటిమెంట్ నిజమవుతుందేమో. 


నవంబర్ 10 న భారత్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.