ODI World Cup 2023: 


ఐసీసీ పెద్దలు పాకిస్థాన్‌కు వెళ్లారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ కచ్చితంగా ఆడేలా హామీ తీసుకోబోతున్నారు. ఆసియాకప్‌తో సంబంధం లేకుండా భారత్‌లో ఆడేలా ఒప్పిస్తారని సమాచారం. ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే, సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ ఇప్పటికే లాహోర్‌ వెళ్లి పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీని కలిశారని కొన్ని వర్గాలు పీటీఐకి తెలిపాయి.


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముందు ఆసియాకప్‌ ఉంటుంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల్ని పీసీబీ సొంతం చేసుకుంది. దాంతో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా అడుగు పెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు. న్యూట్రల్‌ వెన్యూలో ఆడించాలని అంటున్నారు. అయితే హిట్‌మ్యాన్‌ సేన పాక్‌లో ఆడకపోతే పాక్‌ వన్డే ప్రపంచకప్‌ ఆడదని పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ స్పష్టం చేశారు. ఒక హైబ్రీడ్‌ మోడల్‌ను ప్రతిపాదించారు.


'పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడల్‌ గురించి వన్డే ప్రపంచకప్‌ హోస్ట్‌ బీసీసీఐ, ఐసీసీ ఆలోచిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఆసియాకప్‌ గురించి దీనిని ప్రతిపాదించారు. ఒకవేళ దీనికి అంగీకరించినా పీసీబీ మళ్లీ బెదిరింపులకు దిగొచ్చు. భారత్‌లో ప్రపంచకప్‌ ఆడబోమని, ఇలాంటి మోడల్‌కే పట్టుబట్టొచ్చని ఐసీసీ అనుమానం' అని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.


'ఐసీసీ, బీసీసీఐ ఇలాంటి తలనొప్పి కోరుకోవడం లేదు. వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ ఉపఖండంలో పర్యటించాలనే కోరుకుంటున్నాయి. అలాంటప్పుడే ఐసీసీ ఈవెంట్‌ విజయవంతం అవుతుంది. దాయాదుల సమరానికి అవకాశం ఉంటుంది' అని మరొకరు తెలిపారు.


ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు అంగీకరిస్తే పాకిస్థాన్‌ మళ్లీ మళ్లీ ఇలాగే బెదిరింపులకు దిగొచ్చని జేషా భావిస్తున్నారు. అందుకే దీనికి అంగీకరించడం లేదు. 4 మ్యాచులు పాకిస్థాన్‌లో మిగిలిన మ్యాచులు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాగా టోర్నీని తటస్థ వేదికకు మారిస్తే పాకిస్థాన్‌ అందులో ఆడబోదని నజమ్‌ సేథీ స్పష్టం చేస్తున్నారు. కనీసం కొన్ని మ్యాచులైనా తమ దేశం ఆతిథ్యం ఇవ్వకపోతే ప్రపంచకప్‌లో విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


'బీసీసీఐ, పీసీబీ మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఐసీసీ అధికారులు శ్రమిస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ టోర్నీలను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్నారు' అని ఐసీసీ వర్గాలు తెతెలిపాయి.


ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌, ఆస్ట్రేలియా ప్రిపరేషన్స్‌ మొదలు పెట్టాయి. ఆదివారం రెండు బోర్డులు ఐసీసీకి తుది ఆటగాళ్ల జాబితాలను సమర్పించాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టులో మార్పులు చేయగా బీసీసీఐ అలాగే ఉంచింది.


టీమ్‌ఇండియా జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది.


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌