ICC Revenue Share: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొంది, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు ఇతర దేశాల క్రికెట్‌ను తన కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ ఆదాయం మరింత పెరగనుంది. ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38.5 శాతం బీసీసీఐ ఖజానాలోకి వెళ్లనుంది. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 72 శాతం అధికం కావడం గమనార్హం. డర్బన్ (దక్షిణాఫ్రికా) వేదికగా ముగిసిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ మేరకు వివరాలను వెల్లడించినట్టు బీసీసీఐ తెలిపింది. కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో బీసీసీఐ ఆదాయం భారీగా పెరిగింది.
క్రిక్ బజ్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. వచ్చే నాలుగేండ్లలో ఐసీసీ వార్షికాదాయంలో 38.5 శాతం వాటా బీసీసీఐకి దక్కనుంది. అంటే ప్రతియేటా సుమారు 231 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2 వేల కోట్లు) ఆదాయం బీసీసీఐకి రానుంది. గతేడాది వరకూ ఇది 22.4 శాతంగా ఉండేది. కానీ ఐపీఎల్ సూపర్ సక్సెస్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర మార్గాల ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జిస్తున్నది. ఈ ఆదాయంలోంచి ఐసీసీకి కూడా వాటా వెళ్లుతుంది. బీసీసీఐ తర్వాత మరే బోర్డు కూడా డబుల్ డిజిట్ షేర్ పొందలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు 6.89 శాతం, ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)కు 6.25 శాతం వాటాను ఐసీసీ చెల్లించనుంది.
కొత్త ఆదాయ పంపిణీ విధానంలో బీసీసీఐకి మెజారిటీ వాటా దక్కిన నేపథ్యంలో బోర్డు సెక్రటరీ జై షా.. అన్ని స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్‌కు లేఖ రాశాడు. లేఖలో జై షా ‘ఇటీవలే ఐసీసీ ఆమెదించిన కొత్త ఆదాయ పంపిణీలో భాగంగా బీసీసీఐకి 38.5 శాతం వాటా దక్కింది. గతంలో మన షేర్ 22.4 శాతంగా ఉండేది. ఇప్పుడు ఇది 72 శాతానికి పెరిగింది. ఇది గణనీయమైన పెరుగుదల. ఇది బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్‌లు సంయుక్తంగా సాధించిన విజయం. మీ అందరి మద్దతు వల్లే ఇది సాధ్యమైంది..’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఐసీసీకి బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ద్వారా ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగింది. వచ్చే నాలుగేండ్ల కాలానికి గాను డిస్నీ స్టార్.. ఐసీసీ ఈవెంట్స్ బ్రాడ్‌కాస్టింగ్ డీల్‌ను 3.1 బిలియన్ డాలర్స్‌కు సొంతం చేసుకుంది. గతంలో ఇది 1.9 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఈ మార్పు వల్లే బీసీసీఐ షేర్ కూడా ఎకాఎకిన 72 శాతానికి పైగా పెరిగింది.
టీ20 లీగులకు మార్గనిర్దేశకాలు..
ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న కొత్త ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లకు ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఇటువంటి లీగ్‌లలో విదేశీ ఆటగాళ్లను తీసుకునే క్రమంలో వారి సంఖ్య నలుగురికి మించరాదని పేర్కొంది. అంతేగాక ఒక జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ ఆటగాళ్ల లేదా ఐసీసీ అసోసియేట్ సభ్యత్వం కలిగిన క్రికెటర్లను ఆడించాలని డర్బన్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిబంధన ఇదివరకే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అమలవుతున్నది.