ICC T20 World Cup 2024 Anthem Song: వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌(T20 world Cup)  కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఇప్పటికే విడుదల చేసిన ఐసీసీ(ICC)... ఇప్పుడు  ఈ మెగా టోర్నమెంట్‌ అధికారిక గీతాన్ని విడుదల చేసి క్రికెట్‌ ఫీవర్‌ను మరింత పెంచింది.  గ్రామీ అవార్డు విజేత సీన్‌ పాల్‌, సోకా సూపర్‌ స్టార్‌ కెస్‌ సంయుక్తంగా ‘అవుటాఫ్‌ దిస్‌ వరల్డ్‌’ పేరిట ఈ గీతాన్ని రూపొందించారు. మైఖేల్‌ టానో మొంటానో నిర్మాణంలో గీతం రూపొందింది.  టోర్నమెంట్‌కు ముప్పై రోజుల ముందు.. థీమ్ సాంగ్ విడుదలైంది. ఈ పురుషుల పోటీ ప్రపంచ కప్ టోర్నీలో 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో పోటీపడ్డనున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి కేవలం 30 రోజులు మిగిలి ఉన్న వేల ఈ అధికారిక గీతం విడుదల వేడుకలకు ప్రారంభం లాంటిదని ఐసీసీ వెల్లడించింది. ప్రపంచ అభిమానులు కలిసి ఒక అనుభూతిని పొందుతారని... సీన్ పాల్, కేస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కళాకారులు అని... తమ అధికారిక గీతాన్ని రూపొందించినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఈ గీతం మా స్టేడియాలు, గ్లోబల్ బ్రాడ్‌కాస్ట్, ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినబడుతుందని ఐసీసీ వెల్లడించింది. 






మెరిసిన స్టార్లు
ఈ వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్‌ మెడలిస్ట్ ఉసేన్ బోల్ట్, క్రికెట్ స్టార్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో వీరంతా క్రికెట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ కనిపించారు. టోర్నమెంట్‌కు 30 రోజుల ముందు సాంగ్ రిలీజై క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మ్యాచ్ లు యూఎస్‌, వెస్టిండీస్‌లో జూన్‌ 1 నుంచి 29 వరకు జరుగుతాయి. క్రికెట్, మ్యూజిక్‌ ఈ రెండింటికి ప్రజలను ఐక్యత, వేడుకలతో ఒకచోట చేర్చే శక్తి ఉందని తాను నమ్ముతున్నానని గ్రామీ అవార్డు విజేత సీన్‌ పాల్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈపాటతో పాటు స్వరం కలుపుతారని... వెస్టిండీస్, యూఎస్‌ఏలోని అన్ని స్టేడియంలో ఉత్సాహం కనిపిస్తుందని చెప్పాడు.


అంబాసిడర్‌ బోల్ట్‌
టీ20 ప్రపంచకప్ 2024 ప్రచారకర్తగా జమైకన్ పరుగుల చిరుత, ఒంలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసెన్ బోల్ట్‌( Usain Bolt)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నియమించింది. అమెరికాలో క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఐసీసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో తన స్పీడ్‌తో ఒలింపిక్స్‌లో  8 సార్లు బంగారు పతకాలు సాధించిన జమైకా స్పీడ్‌స్టర్ ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించారు. బోల్డ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల, టీ20 వరల్డ్‌కప్‌ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు టోర్నీ నిర్వాహకులు. విభిన్న రకాల స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు.