Worldcup Trophy Tour 2023: ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ 2023 ప్రారంభం అయింది. భూమి పై ఆవరణంలో ఉండే స్ట్రాటోస్ఫియరిక్ స్కేల్‌లో దీన్ని లాంచ్ చేశారు. 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ భారతదేశంలో జరగనుంది. భూమి ఉపరితలం నుంచి 1.2 లక్షల అడుగుల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్‌లో దీన్ని లాంచ్ చేశారు. అక్కడి నుంచి ట్రోఫీ అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియానికి చేరుకోనుంది.


ట్రోఫీని ఒక బీస్టోక్ స్ట్రాటోస్ఫియరిక్ బెలూన్‌కు అటాచ్ చేశారు. భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో ఉందో తెలిసేలా 4కే కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు తీశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ట్రోఫీ టూర్ల కంటే ఇప్పుడు జరగనున్నదే అతి పెద్ద ట్రోఫీ టూర్ కావడం విశేషం. జూన్ 27వ తేదీ నుంచి కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, భారత్... ఇలా అనేక దేశాలను ఈ ట్రోఫీ చుట్టేయనుంది.


ఫుల్ స్కేల్ ట్రోఫీ టూర్ మొదటిసారి 2019లో జరిగింది. ఇప్పుడు ఈ ట్రోఫీ టూర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉత్సవంలా జరుపుకునే వాతావరణాన్ని ఐసీసీ కల్పించింది. దాదాపు 10 లక్షల మంది ట్రోఫీని పర్సనల్‌గా చూసే అవకాశం కూడా కల్పించనున్నారు.


ఈ ట్రోఫీ టూర్ జూన్ 27వ తేదీన భారత్‌లో ప్రారంభం కానుంది. ప్రపంచం మొత్తం చుట్టాక సెప్టెంబర్ 4వ తేదీన తిరిగి వన్డే ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇస్తున్న భారత్‌కే తిరిగి చేరనుంది.


ట్రోఫీ టూర్ పూర్తి షెడ్యూల్:


27 జూన్ - 14 జూలై: భారతదేశం
15 జూలై - 16 జూలై: న్యూజిలాండ్
17 జూలై - 18 జూలై: ఆస్ట్రేలియా
19 జూలై - 21 జూలై: పాపువా న్యూ గినియా
22 జూలై - 24 జూలై: భారతదేశం
25 జూలై - 27 జూలై: USA
28 జూలై - 30 జూలై: వెస్టిండీస్
31 జూలై - 4 ఆగస్టు: పాకిస్తాన్
5 ఆగస్టు - 6 ఆగస్టు: శ్రీలంక
7 ఆగస్టు - 9 ఆగస్టు: బంగ్లాదేశ్
10 ఆగస్టు - 11 ఆగస్టు: కువైట్
12 ఆగస్టు - 13 ఆగస్టు: బహ్రెయిన్
14 ఆగస్టు - 15 ఆగస్టు: భారతదేశం
16 ఆగస్టు - 18 ఆగస్టు: ఇటలీ
19 ఆగస్టు - 20 ఆగస్టు: ఫ్రాన్స్
21 ఆగస్టు - 24 ఆగస్టు: ఇంగ్లాండ్
25 ఆగస్టు - 26 ఆగస్టు: మలేషియా
27 ఆగస్టు - 28 ఆగస్టు: ఉగాండా
29 ఆగస్టు - 30 ఆగస్టు: నైజీరియా
31 ఆగస్టు - 3 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా
సెప్టెంబర్ 4 నుంచి: భారతదేశంలో ఉండనుంది.