MS Dhoni: 


ఎంఎస్‌ ధోనీ..! ఇన్నాళ్లూ టీమ్‌ఇండియాను నడిపించిన ఎమోషన్‌! ప్రతి మ్యాచ్‌.. ప్రతి సిరీస్‌.. ప్రతి టోర్నీలో అతడే మన వెన్నెముక. వికెట్ల వెనకాల నిలబడి వ్యూహాలెన్నో రచించాడు. ప్రత్యర్థులను ఓడించాడు. కుర్రాళ్లను ఉరికించాడు. బౌలర్లకు మార్గదర్శనం చేశాడు. క్రీజులో నిలబడి ఎన్నో మ్యాచుల్ని ఫినిష్‌ చేశాడు. అలాంటిది అతడు లేకుండా టీమ్‌ఇండియా తొలి వన్డే ప్రపంచకప్‌ ఆడుతోంది. క్రికెటర్లు ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు! మహీ మాత్రం చెరగని ముద్రవేశాడు.


ఆడేకొద్దీ బుర్రకు పదును!


బక్కపల్చని జులపాల కుర్రాడు వికెట్‌ కీపింగ్‌ చేస్తుంటే ఈ ప్రపంచం ఆశ్చర్యంగా చూసేది. అతడు బ్యాటు పట్టుకొని బాదేస్తుంటే అబ్బురపడేది. అతడి ఆలోచనలకు ప్రత్యర్థి జట్లు సాగిలపడేవి. అతడి మైండ్‌వర్క్‌ చూసి తట్టుకోలేకపోయేవి. 2004లో అరంగేట్రం చేసిన ఎంఎస్‌ ధోనీ 2007లో తొలి వన్డే ప్రపంచకప్‌ ఆడాడు. అఫ్‌కోర్స్‌..! ఎన్నో ఆశలతో వెస్టిండీస్‌కు వెళ్లిన టీమ్‌ఇండియాకు అప్పుడేగతి పట్టిందో తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్న ఛాపెల్‌ జట్టును ఆగమాగం చేశాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్సీ చేపట్టిన మహీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మ్యాచులు ఆడే కొద్దీ తన క్రికెట్‌ బుర్రకు పదును పెట్టాడు. మ్యాచ్‌లో ఎప్పుడేం జరుగుతుందో, అవతలి ఆటగాడు ఎలా ఆలోచిస్తాడో ముందే పసిగట్టేవాడు.


మలుపు తిప్పిన 2011


టీమ్‌ఇండియా ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోనే అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. యువరాజ్‌ సింగ్‌ సహా అద్భుతమైన ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. అదే ఉత్సాహంతో 2011లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు మహీ. ఫైనల్లో తనదైన శైలిలో సిక్సర్‌ కొట్టి 28 ఏళ్ల కప్పు కలను నెరవేర్చాడు. మళ్లీ అతడికి యువరాజ్‌ సింగ్, సచిన్‌, జహీర్‌ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సపోర్ట్‌ చేశారు. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీనీ అందుకున్నాడు. 2015లో టీమ్‌ఇండియా అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియా వెళ్లింది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత విజయాలు సాధించింది. అయితే సెమీస్‌లో ఓడింది. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో మహీ ఆటగాడిగా ఆడాడు. ఎక్కువ పరుగులేమీ చేయకపోయినా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో అతడి పోరాటం ఆకట్టుకుంది. జడేజా, భువనేశ్వర్‌ను పెట్టుకొని హాఫ్‌ సెంచరీతో ఆశలు రేపాడు. కానీ అతడి రనౌట్‌ అభిమానులను ఏడిపించింది.


గణాంకాలు చిరస్మరణీయం!


ఎంఎస్‌ ధోనీ 2007 నుంచి 2019 వరకు నాలుగు ప్రపంచకప్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 29 మ్యాచుల్లో 43.33 సగటు, 89.96 స్ట్రైక్‌రేట్‌తో 780 పరుగులు సాధించాడు. అయితే మెగా టోర్నీల్లో అతడికి ఒక్క సెంచరీ లేకపోవడం వెలితి! ఐదు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 59 బౌండరీలు, 15 సిక్సర్లు బాదేశాడు. ఇక వికెట్‌ కీపింగ్‌లోనూ రికార్డులు సృష్టించాడు. 42 మంది డిస్మిసల్స్‌లో భాగస్వామిగా నిలిచాడు. 8 స్టంపౌట్లు, 34 క్యాచ్‌ ఔట్లు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో మహీ 8 ఇన్నింగ్స్‌ల్లో 241 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో శ్రీలంకపై 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్యాట్‌ను తిప్పి 28 ఏళ్ల తర్వాత దేశానికి ప్రపంచకప్‌ అందించిన మధుర క్షణాలను టీమ్‌ఇండియా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.