ODI World Cup 2023: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు మిగిలుంది  రెండు  నెలలు మాత్రమే. ఈ నేపథ్యంలో పలువురు మాజీలు మెగా టోర్నీలో సెమీఫైనలిస్టులు, ఒక్కో జట్టు విజయావకాశాలపై విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్,  భారత జట్టు 20‌07, 2011 లో గెలిచిన టీ20, వన్డే వరల్డ్ కప్‌లలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రస్తుతం భారత జట్టు సారథి రోహిత్ శర్మ  మంచి కెప్టెనే అయినా ఒక్క సారథితోనే వరల్డ్ కప్ గెలవలేమని, అందుకు ఇతర ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన సీనియర్లు కూడా సహకరించాలని  చెప్పాడు. 2‌011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు ధోనికి సీనియర్లు, అద్భుతమైన ఆటగాళ్లు దొరికారని వ్యాఖ్యానించాడు. 


ఓ క్రీడా జర్నలిస్టుతో జరిగిన ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌లో  యువీ మాట్లాడుతూ.. ‘రోహిత్  మంచి కెప్టెనే. అందులో సందేహం లేదు.  కానీ  అతడికి మంచి జట్టు కూడా కావాలి.   ఎంఎస్ ధోని  కూడా గొప్ప మంచి  సారథే. కానీ అతడికి మంచి టీమ్ దొరికింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు దొరికారు.  అందరూ అతడికి సహకారం అందించడం వల్లే వరల్డ్ కప్ కల సాకారమైంది’ అని  తెలిపాడు.  


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా నడిపించిన రోహిత్.. ప్రపంచకప్‌లో కూడా దానిని కొనసాగిస్తాడని  యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా నడిపించాడు.  ఒత్తిడిలో కూల్‌గా ఉండటం అతడికి ఉన్న గొప్ప లక్షణం.  అతడికి మంచి టీమ్‌, అనుభవం కలిగిన ఆటగాళ్లను ఇస్తే  వాళ్లతో అతడు అద్భుతాలు చేయగలడు..’అని  అన్నాడు. 


కాగా వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు గాను భారత్ ఈ ఏడాది జనవరిలోనే 20 మంది ఆటగాళ్లతో కూడిన కోర్ గ్రూప్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కానీ ఈ టీమ్‌లో   కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ఇంకా గాయంతో పూర్తిస్థాయిలో కోలుకోలేదు.  బుమ్రా ఫిట్ అయి ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా అతడు ఏ మేరకు రాణించగలడు..? అన్నది తేలాల్సి ఉంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి  గురై  ఇప్పుడిప్పుడే నడవడం స్టార్ట్ చేశాడు.  ప్రస్తుతం ఉన్న జట్టులో కూడా మిడిలార్డర్‌లో అంతో ఇంతో అనుభవం కలిగిన  సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ కూడా విఫలమవుతున్నారు. ఇన్ని ఒడిదొడుకుల మధ్య స్వదేశంలో భారత జట్టు ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. 


 






సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఇవే : మెక్‌గ్రాత్


వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవేనంటూ ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అంచనావేశాడు.  వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌‌లు సెమీస్ చేరుతాయని ఆయన జోస్యం చెప్పాడు.


 





























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial