ICC ODI World Cup 2023: సుమారు ఆరు నెలలుగా కొనసా...గిన ఆసియా కప్ నిర్వహణ వివాదం ఎట్టకేలకు ఇటీవలే సద్దుమణిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తాము పాకిస్తాన్ కు రాబోమని, తటస్థ వేదిక అయితేనే ఆసియా కప్ ఆడతామని మొండిపట్టు పట్టి తన పంతం నెగ్గించుకున్నది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ లో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్న వేళ ఆ జట్టు మరో కొత్త కొరివిని పెట్టుకుంది. ‘ఈసారి టైమ్ మాది’ అనుకుని.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు వచ్చేదే లేదని, తమకూ తటస్థ వేదికలు కావాలని పట్టుబడుతున్నారు.
హైబ్రిడ్ మోడల్..
ఆసియా కప్ - 2023 లో భారత్ న్యూట్రల్ వెన్యూస్ లో ఆడుతున్నట్టే వన్డే వరల్డ్ కప్ లో తాము కూడా భారత్ లో కాకుండా మరో వేదికలో ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయమై పీసీబీ ఇదివరకే ఐసీసీ, బీసీసీఐ లకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఈ మేరకు తటస్థ వేదికగా బంగ్లాదేశ్ ను ఎంపిక చేసినట్టు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో లో వచ్చిన ఓ కథనం ఆధారంగా తెలుస్తున్నది.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు తాము రాబోమని పీసీబీ.. ఆసియా కప్ వివాదంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించిన సమావేశంలోనే ప్రతిపాదించిందని సమాచారం. అందులో వచ్చిన హామీ మేరకే ఆసియా కప్ లో భారత్ ను న్యూట్రల్ వెన్యూస్ లో ఆడించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ కూడా ఓకే చెప్పడానికి కారణం కూడా అదేనట. ఈ సమస్య ఒక్క ఆసియా కప్, వరల్డ్ కప్ తో ముగిసేది కాదు. 2025లో పాకిస్తాన్ వేదికగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. దీనికి కూడా ఈ మోడల్ నే పాటించే అవకాశాలున్నాయి.
మేం కూడా రాం.. : వసీం ఖాన్
ఆసియా కప్ లో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ కు రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ కోసం అక్కడికి వెళ్లబోమని పీసీబీ మాజీ సీఈవో, ప్రస్తుతం ఐసీసీ మేనేజర్ ఆఫ్ క్రికెట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వసీం ఖాన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పాకిస్తాన్ లోని ఓ స్థానిక ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘రాబోయే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు భారత్ కు వెళ్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఆసియా కప్ కోసం భారత్ న్యూట్రల్ వెన్యూస్ ను కోరుకుంటున్నట్టే.. ప్రపంచకప్ లో మేమూ పాకిస్తాన్ కూడా ఇదే విధానాన్ని పాటిస్తుందని నేను భావిస్తున్నా..’ అని చెప్పాడు.
మరి పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రకటనలు, వాదనలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, ఐసీసీ ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.