ICC ODI World Cup 2023: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు మళ్లీ మారింది! ఏకంగా తొమ్మిది మ్యాచుల వేళల్లో ఐసీసీ మార్పులు చేసింది. మ్యాచుల మధ్య అంతరం కావాలని, లాజిస్టిక్స్‌ ఇబ్బందులు ఉన్నాయని కొన్ని బోర్డులు కోరడంతోనే ఇలా చేశారని తెలిసింది.


ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 14కు జరిపారు. ఐసీసీ నిర్ణయంతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్ జట్లపై ఎక్కువ ప్రభావం పడింది. పాకిస్థాన్‌ మూడు మ్యాచులు, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ చెరో రెండు మ్యాచుల్లో మార్పులు చేశారు. అక్టోబర్‌ 10 ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ తలపడే మ్యాచును డే/నైట్‌ నుంచి పగటి పూటకు మార్చారు. అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో శ్రీలంకతో తలపడాల్సిన పాకిస్థాన్‌ మ్యాచును అక్టోబర్‌ 10కి మార్చారు. దీంతో టీమ్‌ఇండియాతో మ్యాచుకు ముందు దాయాది జట్టుకు సరైన విశ్రాంతి దొరుకుతుంది.


అక్టోబర్‌ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచును ఒక రోజు ముందుకు జరిపారు. దిల్లీలో అక్టోబర్‌ 14న జరగాల్సిన ఇంగ్లాండ్‌-అఫ్గాన్‌ మ్యాచును మరుసటి రోజుకు మార్చారు. చెన్నైలో అక్టోబర్ 14న న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన డే మ్యాచును అక్టోబర్‌ 13న డే/నైట్‌కు మార్చారు. నవంబర్‌ 12న జరగాల్సిన డబుల్‌ హెడర్‌ను ఒక రోజు ముందుకు జరిపారు. ఆ రోజు ఆస్ట్రేలియా x బంగ్లాదేశ్ మ్యాచ్‌ పుణె, ఇంగ్లాండ్‌ x కోల్‌కతా మ్యాచ్‌ కోల్‌కతాలో జరగాలి. కాళీ పూజ సందర్భంగా సెక్యూరిటీ కల్పించలేమని  కోల్‌కతా పోలీసులు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెప్పడంతో ఇలా చేశారు.


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ లీగ్‌ స్టేజ్‌ నవంబర్‌ 12న భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచుతో ముగుస్తుంది. వాస్తవంగా ఇది నవంబర్‌ 11న జరగాలి. ఇక ఆరంభ, సెమీ ఫైనళ్లు, చివరి మ్యాచుల సమయాల్లో మార్పేమీ లేదు. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ తొలి మ్యాచులో తలపడతాయి. నవంబర్‌ 15, 16న సెమీ ఫైనళ్లు జరుగుతాయి. నవంబర్‌ 18న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.


దుర్గా నవరాత్రుల సందర్భంగా రక్షణ కల్పించలేమని పోలీసులు చెప్పడం వల్లే మ్యాచుల సమయాలు మారుస్తున్నారని కొందరు చెబుతున్నారు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌నూ అందుకే మార్చారని అంటున్నారు. అయితే ఈ వార్తలను బీసీసీఐ కార్యదర్శి జే షా కొట్టిపారేశారు. 'ఒకవేళ సెక్యూరిటీ సమస్యలే ఉంటే ఆ మ్యాచ్‌ అక్కడికి ఎందుకు వెళ్తుంది. 14-15 తేదీలు అనేవి సమస్యే కాదు. లాజిస్టిక్స్‌ సమస్యల వల్ల షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కొన్ని బోర్డులు లేఖ రాశాయి. కొన్ని మ్యాచుల మ్యాచుల మధ్య రెండు రోజుల అంతరమే ఉంది. ఒక రోజు ప్రయాణం చేసి వెంటనే మ్యాచు ఆడాలంటే కష్టం' అని ఆయన స్పష్టం చేశారు.


Also Read: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్