ICC ODI WC 2023: భారత్‌(Bharat)  వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగిసింది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోయిన టీమిండియా(Team India) ... ఫైనల్లో తుదిమెట్టుపై బోల్తా పడింది. కోట్ల మంది భారత ఆభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా(Austrelia) ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.  ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ(ICC) ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది.


అయితే టీమిండియా ఓటమికి అసలు కారణం అహ్మదాబాద్‌(Ahamadabad) పిచ్‌ అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానులు టీమిండియా ఓటమికి నరేంద్ర మోదీ స్టేడియమే కారణమంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగడం వల్లే టీమిండియా ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. అక్కడ కాకుండా మరే ఇతర స్టేడియంలో మ్యాచ్ జరిగినా మనమే గెలిచేవాళ్లమని అంటున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇలాగే స్పందిస్తుడడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. టీమిండియా ఓటమికి ఒక రకంగా చెప్పుకోవాలంటే పిచ్ కారణమని పాకిస్థాన్(Pakistan) మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్న భారత్ అహ్మదాబాద్‌లో మెరుగైన పిచ్ రెడీ చేసుకోవాల్సిందని అక్తర్ అన్నాడు. ఎందుకంటే భారత జట్టు అదృష్టంతో ఫైనల్ చేరలేదని.. అందరినీ ఆశ్చర్యపరిచేలా విజయాలు సాధించి ఫైనల్ చేరుకున్నారని గుర్తుచేశాడు. కానీ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ మాత్రం తనను పూర్తిగా నిరాశ పరిచిందన్నాడు.

 

పిచ్ కారణంగా టీమిండియా బ్యాటింగ్ నత్తనడకన సాగిందని ఆ జట్టు బ్యాటర్లు చాలా మెత్తపడిపోయి ఆడారని షోయబ్ అక్తర్ విశ్లేషించాడు. కానీ అలా కాకుండా ఎప్పటి తరహాలోనే ఎటాకింగ్ ఆట ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. పిచ్ నుంచి మరికొంత పేస్, బౌన్స్ లభిస్తే అసలు టాస్ పెద్దగా ప్రభావమే చూపించేది కాదని అక్తర్ చెప్పుకొచ్చాడు. దురదృష్టం ఏంటంటే గత కొన్నేళ్లుగా పెద్ద మ్యాచ్‌లలో భారత్ తడబడుతూనే ఉందని అక్తర్ పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఈ అలవాటు మార్చుకోవాలని హితవు పలికాడు.

 

ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్‌ స్టార్‌ పేర్కొన్నాడు.