ICC Mens Test Rankings: మరో నెల రోజుల్లో  ఇంగ్లాండ్‌లోని ‘ది ఓవల్’ వేదికగా  ఆస్ట్రేలియాతో  జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఐసీసీ పురుషుల టెస్టు  ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ హోదాతో బరిలోకి దిగనుంది. ఈ మేరకు  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం  చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 


ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక  ర్యాంకులలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.  15 నెలలుగా నెంబర్ వన్ ర్యాంకులో కర్చీప్ వేసుకుని కూర్చున్న కంగారూలు.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ దెబ్బతో పాటు గడిచిన రెండేండ్లుగా చేసిన ప్రదర్శనలతో  ఐదు పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు. 


కొత్త ర్యాంకుల ప్రకారం భారత్‌ 126 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా ఆస్ట్రేలియా 116 పాయింట్లతో  రెండో స్థానానికి  పడిపోయింది.   ఈ జాబితాలో భారత్, ఆసీస్ తర్వాత  ఇంగ్లాండ్ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్తాన్ (86), శ్రీలంక (84), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (45), జింబాబ్వే (32) లు నిలిచాయి. 


 






వార్షిక ర్యాంకులను  ఈ రెండేండ్ల సైకిల్ (2021 - 2023) మధ్య జరిగిన మ్యాచ్‌లతో పాటు  2020 మే  నుంచి 2022 మే వరకు జరిగిన సిరీస్ ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.  2020-2022  మధ్య పూర్తైన సిరీస్ లకు  50 శాతం , ఆ తర్వాతి సిరీస్ లకు  వంద శాతం పాయింట్లను కేటాయించినట్టు ఐసీసీ ప్రకటనలో వెల్లడించింది.   దీని ప్రకారం   2020 - 2022 మధ్య  ఆసీస్ గెలిచిన సిరీస్ లకు తక్కువ వెయిటేజ్ ఉండటంతో ఆ జట్టు  ఐదు పాయింట్లు కోల్పోయి.. 116  పాయింట్లకు పరిమితమైంది.  


కాగా  జూన్ 7 నుంచి 11 వరకు  భారత్ - ఆస్ట్రేలియా  మధ్య ది ఓవల్‌లో  డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.  ఈ మేరకు ఇదివరకే ఇరు జట్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించాయి.  ఐపీఎల్ - 16 ముగిసిన వెంటనే భారత టెస్టు ఆటగాళ్లు ఇంగ్లాండ్ వెళ్తారు. ఆసీస్  ఆటగాళ్లు ఇప్పటికే  పలువురు ఇంగ్లాండ్ లో  కౌంటీలు (లబూషేన్, స్మిత్)  ఆడుతున్నారు. 


 






డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్ మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌