ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైంది. స్వదేశంలో జరుగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతున్న  టీమిండియా.. పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని ఒడిసిపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  వరల్డ్ కప్‌కు మరో రెండు నెలలే సమయం ఉండటంతో  ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. అయితే  వరల్డ్ కప్ గెలిచినా ఓడినా  పాజిటివ్ మైండ్‌తో ఉండటం ముఖ్యమంటున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ ట్రోఫీ నెగ్గడం అంత ఈజీ కాదని  కూడా  వ్యాఖ్యానించాడు. 


ఇటీవలే వెస్టిండీస్‌‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో  12 వికెట్లు పడగొట్టి స్వదేశానికి చేరిన అశ్విన్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వరల్డ్ కప్, టీమిండియా ప్రిపరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ.. ‘భారత్‌‌లో జరుగబోయే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్లన్నీ తాము ట్రోఫీని గెలిచేందుకే  బరిలోకి దిగుతాయి.  భారత్ కూడా అదే దృక్ఫథంతో ఉంటుంది.  ఒకవేళ మనం  ప్రపంచకప్ గెలవకపోయినా  ప్రపంచమేమీ ఆగిపోదు. మనం ముందుకు సాగాల్సిందే. ఒకవేళ గెలిస్తే ఆటగాళ్లను అభినందిద్దాం... 


అభిమానులను నా విన్నపం ఏంటంటే.. ప్రపంచకప్‌ ఆడబోయే ముందు టీమిండియాకు పాజిటివ్ దృక్పథాన్ని ఇవ్వండి.  ప్రపంచకప్ గెలవడం అంత ఈజీ కాదు.  గతంలో టీమిండియా చాలాసార్లు  ఐసీసీ ట్రోఫీలలో సెమీస్ వరకూ వెళ్లగలిగింది. దాదాపు అన్ని మేజర్ ఈవెంట్స్‌లో జట్టు బాగా ఆడింది. కానీ ఆరోజు (సెమీస్ మ్యాచ్‌లలో) మన రోజు బాగోలేదు.  మన రోజు బాగోలేనప్పుడు మనం ఏం చేయగలం..? మనకు ఇప్పుడు  చాలా పాజిటివిటీ కావాలి.  మనను చూసి టీమిండియా ఆటగాళ్లు కూడా  ‘జనం మా వెంట ఉన్నారు’ అని ఫీల్ అవ్వాలి. వాళ్ల ఆటను వాళ్లను ఆడనిస్తే  ఎవరైనా సక్సెస్ అవుతారు...’అని చెప్పుకొచ్చాడు. 


టీమిండియా చాలా  హార్డ్ వర్కింగ్ టీమ్ అని అందులో సందేహమే లేదని అశ్విన్  తెలిపాడు. జిమ్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆటగాళ్లు గంటలకు గంటలు కష్టపడతారని, ప్రపంచంలో టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడే టీమ్ మరొకటి లేదని  అశ్విన్  పునరుద్ఘాటించాడు. అయితే టీమ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వ్యాఖ్యలు కపిల్ దేవ్‌కు కౌంటర్ గానే చేసినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓడిన తర్వాత కపిల్ దేవ్.. భారత జట్టులో అహంకారం ఎక్కువైందని, ఎవరూ సలహాలు తీసుకోవడం లేదని, అన్నీ తమకే తెలుసుననే భావనలో ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  దీనికి నిన్నే రవీంద్ర జడేజా కూడా క్లారిటీ ఇచ్చాడు. టీమిండియాలో ఎవరికీ అహంకారం లేదని అందరూ టీమ్ కోసమే ఆడతారని  చెప్పాడు. ఇప్పుడు అశ్విన్ కూడా కపిల్ వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా ఆయనకు కౌంటర్‌గానే ఇలాంటి కామెంట్స్ చేశాడని  నెటిజన్స్ వాపోతున్నారు.  


ఇక వన్డే వరల్డ్ కప్ విషయానికొస్తే అక్టోబర్ 5 నుంచి మొదలుకాబోయే ఈ మెగా టోర్నీలో భారత జట్టు  తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న  చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది.




















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial