ODI World Cup 2023:  భారత్ వేదికగా అక్టోబర్ - నవంబర్ మాసాలలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించేందకు  పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)..  మ్యాచ్‌‌లను రసవత్తరంగా మార్చాలంటే ముఖ్యభూమిక పోషించే పిచ్ క్యూరేట్లరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.   మ్యాచ్‌లను వన్ సైడెడ్  పోరులా కాకుండా  ఇరు జట్లకూ బ్యాట్, బంతి మధ్య  ఆసక్తికర పోరు ఉండేలా చూడాలని, ఆ దిశగా పిచ్‌లను తయారుచేయాలని  కోరింది. బౌండరీ లైన్ దూరాన్ని పెంచాలని, పిచ్ మీద పచ్చిక ఎక్కువ ఉండేలా చూసుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా  అక్టోబర్ - నవంబర్ మాసాలలో  మంచు మ్యాచ్‌ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో  అందుకు తగ్గట్టుగా పిచ్‌లను తయారుచేయాలని  క్యూరేటర్లను ఆదేశించింది. 


వచ్చే ప్రపంచకప్‌లో బౌండరీల దూరం 70 మీటర్ల (ఇదే మినిమం)  కంటే  ఎక్కువగా ఉండాలని, పిచ్ మీద గ్రాస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తద్వారా  సీమర్లకు, స్పిన్నర్లకు సమానంగా పిచ్ సహకరించే విధంగా ఉండాలని  తెలిపింది.  


మంచు కురిసే వేళలో.. 


ఇదే విషయమై  ఐసీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అక్టోబర్ - నవంబర్‌లలో భారత్‌లోని ఈశాన్య,  ఉత్తరాది రాష్ట్రాలలో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. చెన్నై, బెంగళూరులో ఆ రిస్క్ కాస్త తక్కువే ఉండొచ్చు. మంచు వల్ల రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు లాభపడుతుంది.  డ్యూ కారణంగా పిచ్  స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. కానీ పిచ్ మీద గడ్డి ఎక్కువగా ఉంటే అప్పుడు  స్పిన్నర్లకే గాక  సీమర్లకూ వికెట్లు తీసే అవకాశం దక్కుతుంది. గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల జట్లు కూడా  స్పిన్నర్ల మీద అతిగా ఆధారపడవు. వన్డే గేమ్‌లో భారీ స్కోర్లే కాదు లో స్కోరింగ్ థ్రిల్లర్స్ కూడా అభిమానులకు మజాను ఇస్తాయి’ అని చెప్పాడు.  


2021లో దుబాయ్‌లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో  మంచు ప్రభావం మ్యాచ్ ఫలితాలపై తీవ్రంగా పడింది. ఆ టోర్నీలో దాదాపుగా రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయవంతం అయ్యాయి. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా చూసుకోవాలని  ఐసీసీ క్యూరేటర్లకు తెలిపింది.  






బౌండరీ దూరం పెరగాలి.. 


సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు బౌండరీ దూరం 65 మీటర్ల నుంచి 80 మీటర్ల వరకూ ఉంటుంది. గతంలో  వన్డే ప్రపంచకప్‌లకు బౌండరీ దూరం 70-75 మీటర్ల  వరకూ ఉండేది.  ఇప్పుడు కూడా బౌండరీ సైజ్‌ను 70 మీటర్లకు తగ్గకుండా చూసుకోవాలని  ఐసీసీ ఆదేశించింది.  


వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు అన్నీ దాదాపు  డే అండ్ నైట్ జరిగేవే.  వీటికి మంచు తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే  ఔట్ ఫీల్డ్‌తో పాటు గ్రౌండ్ మొత్తంలో మంచును తొలగించేందుకు గాను  ‘వెట్టింగ్ ఏజెంట్’ను ఉపయోగించాలని సూచించింది.  అయితే  ఐసీసీ, బీసీసీఐ  రూపొందించిన ప్రమాణాల మేరకు వెట్టింగ్ ఏజెంట్‌ను వాడాలని ఆదేశించింది. 


పిచ్ క్యూరేటర్లకు ఐసీసీ ఆదేశించిన ఈ మూడు  విషయాలూ బౌలర్లకు అనుకూలించేవే. వీటి ప్రకారం చూస్తే వన్డే వరల్డ్ కప్‌లో పరుగులు రాబట్టాలంటే బ్యాటర్లు చెమటోడ్చాల్సిందే...!