భారత్-పాక్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. దీనిని మ్యాచ్‌లాకాక ఓ యుద్ధంలా చూస్తారు. అందుకే దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది. ఆటగాళ్ల కవ్వింపులు మ్యాచ్‌ను మరింత ఉద్విగ్నంగా మారుస్తాయి. ఇరువైపుల ఆటగాళ్లు మాటలతో ఒకరిని ఒకరు కవ్వించుకుని పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. రేపు(శనివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే ఇరువైపుల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ షా అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అయిదు వికెట్లు నేలకూలుస్తానని షాహీన్ ఆఫ్రిదీ అతిపెద్ద ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
భారత్‌పై 5 వికెట్లు తీస్తాను అంటూ భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాహీన్ ఆఫ్రిది చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ ప్రకటనతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. తొలిసారి భారత్ గడ్డపై మ్యాచ్ ఆడేందుకు వచ్చిన షాహీన్ అఫ్రిది.. భారత్‌పై 5 వికెట్లు తీస్తానని ప్రకటించాడు. కొత్త బంతితో షాహీన్ షా అఫ్రీదీని ఎదుర్కోవడంలో భారత్ కాస్త ఇబ్బంది పడినట్లు గత రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కొత్తబంతితో షాహీన్ వేసే స్వింగ్‌ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత టాపార్డర్‌లో ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంతో కొంచెం ఇబ్బంది పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ అది కనిపించింది. ఇప్పటివరకూ 46 వన్డేలు ఆడిన షాహీన్ షా అఫ్రీదీ కేవలం రెండుసార్లు మాత్రమే 5 వికెట్లు పడగొట్టాడు.
కానీ ఈ ప్రపంచకప్‌లో షాహీన్ షా పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆసియా కప్‌లో షాహీన్ అఫ్రిది టీమ్ ఇండియాతో రెండు మ్యాచ్‌లు ఆడాడు. తొలి మ్యాచ్‌లో షాహీన్ 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను అఫ్రీదీ అవుట్ చేశాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత సూపర్-4 దశలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై షాహీన్ పూర్తిగా వెలవెలబోయాడు. 7.90 ఎకానమీతో 10 ఓవర్లలో 79 పరుగులు ఇచ్చాడు. భారత్‌పై ఇప్పటివరకూ మూడు వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ స్పీడ్ స్టార్... 31.20 సగటుతో 5 వికెట్లు తీసుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం సాధించి రికార్డును మరింత పెంచాలని పట్టుదలతో ఉంది.
Also Read: దాయాదుల పోరుకు ముందు మ్యూజికల్ కాన్సర్ట్
Also Read: వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ సూపర్ రికార్డు - 8-0పై కన్నేసిన టీమిండియా!