హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2022 మ్యాచ్ ను తనకు గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్నేహితురాలికి తన ప్రేమను తెలిపాడు. ఆమె కూడా అతని ప్రపోజల్ ను అంగీకరించింది.  


భారత్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే షా.. చేతిలో ఉంగరంతో తన ప్రియురాలి ముందు  మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేశాడు. అతని ప్రతిపాదనకు మొదట ఆశ్చర్యపోయిన ఆమె.. తర్వాత సంతోషంగా అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 26 ఏళ్ల షా హాంకాంగ్ తరఫున 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. 28 బంతుల్లో 30 పరుగులు చేసి భువీ బౌలింగ్ లో ఔటయ్యాడు.


మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అయిన కించిత్ షా ఇప్పటివరకు 43టీ 20 ఆడాడు. 20.42 సగటుతో 633 పరుగులు చేశాడు. టీ20ల్లో అతని అత్యధిక స్కోరు 79. ఇది ఐర్లాండ్ పై సాధించాడు. బంతితోనూ 11 వికెట్లు తీశాడు.


ఉత్సాహంగా ఆసియా కప్


ఆసియా కప్‌-2022 ఊహించిన దాని కన్నా ఉత్సాహంగా కొనసాగుతోంది. మ్యాచులన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సూపర్‌-4కు చేరుకుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్‌ తొలి గెలుపు కోసం ఎదురు చూస్తోంది. హాంకాంగ్‌పై విజయం అందుకొని సూపర్‌-4కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. 


హాంకాంగ్‌పై పాక్ ఆశలు!


గ్రూప్‌-ఏలో టీమ్‌ఇండియా నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది. తొలి మ్యాచులో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇక బుధవారం జరిగిన పోరులో హాంకాంగ్‌పై భారీ తేడాతో విజయం అందుకుంది. 4 పాయింట్లు, 1.096 నెట్‌రన్‌రేట్‌తో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓటమి పాలైనప్పటికీ పాకిస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. నెట్‌ రన్‌రేట్‌ (-0.175) మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. హాంకాంగ్‌ -2.00 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌ విజేత సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. 


భారత్ x హాంకాంగ్ పోరులో ఏం జరిగింది?


ఆసియాకప్ టోర్నీలో భారత్ ఖాతాలో మరో విజయం పడింది. బుధవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హాంగ్ కాంగ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.