Uppal stadium News Today : టీమిండియా మాజీ క్రికెటర్, మహ్మద్ అజారుద్దీన్ కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ పేరు తొలగించాలని HCAకు అంబుడ్స్ మన్ జస్జిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. 

తన పేరు ఎలా పెట్టుకుంటారు.. అంబుడ్స్ మన్ ఆగ్రహం

లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్ మన్ జస్టిస్ ఈశ్వరయ్య విచారణ జరిపారు. HCA ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అజారుద్దీన్ నార్త్ స్టాండుకు తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తన పేరు తనే పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్ మన్ స్పష్టం చేశారు. అజారుద్దీన్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్ మన్ తీర్పు ఇచ్చారు. దాంతో వెంటనే ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని HCAకు ఆదేశాలు జారీ చేశారు. టికెట్లపై ఇక నుంచి ఆ పేరు ప్రస్థావన ఉండొద్దని అంబుడ్స్ మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెల్చిచెప్పారు.

ఇదివరకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు హెచ్‌సీఏ వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమకు సరైన గౌరవం దక్కడం లేదని, హెచ్‌సీఏ ప్రతినిధులు సహకరించడం లేదని ఆరోపించింది. ఓ దశలో హైదరాబాద్ ను వీడి వేరే కేంద్రాన్ని తమ హోస్ట్ సిటీగా మార్చుకుంటామని సైతం ప్రకటన చేయడం తెలిసిందే. చివరికి హెచ్‌సీఏ ప్రతినిధులు, సన్ రైజర్స్ ప్రతినిధులు సమావేశమై ఐపీఎల్ టికెట్లు పాసులపై తేల్చడంతో వివాదం సద్దుమణిగింది. హెచ్‌సీఏ లో ఎన్నికలు జరపకుండా వాయిదా వేయడంపై సైతం గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ తీసుకున్న నిర్ణయాలపై ఇంకా వివాదాలు సద్దుమణగలేదని తెలుస్తోంది.