Ind Vs Eng Pune T20 Updates: ఇంగ్లాండ్ తో పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20 భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో 15 పరుగులతో విజయం సాధించి, 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా హర్షిత్ రాణా రావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చీటింగ్ చేసి ఇండియా గెలిచిందని సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోల్ చేస్తున్నారు. కంకషన్ రూల్ ని ఇండియా టాంపర్ చేసిందని పేర్కొంటున్నారు. అసలేమైందంటే ఇన్నింగ్స్ 20వ ఓవరి ఐదో బంతికి బౌలర్ విసిరిన బంతి శివమ్ దూబే హెల్మెట్ కు తాకింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అనుమతితో దూబేకు కంకషన్ సబ్ స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను బరిలోకి దించారు. అతను మూడు వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తాజాగా దీనిపై క్రికెట్ ప్రపంచంలో రగడ స్టార్టయ్యింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పలువురు మాజీలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.






ఐసీసీ రూల్ ఏం చెబుతుందంటే..?
నిజానికి బ్యాటర్ గాయపడి కంకషన్ కు గురైతే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ చేయాలని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అంటే బ్యాటర్ గాయపడితే బ్యాటర్, బౌలర్ గాయపడితే బౌలర్, ఆల్ రౌండర్ గాయపడితే ఆల్ రౌండర్ కానీ, అతను బౌలింగ్ చేసే నిర్ణయాన్ని రిఫరీ తీసుకోవచ్చు. ఇక శుక్రవారం మ్యాచ్ లో పేస్ ఆల్ రౌండర్ అయిన దూబే గాయపడటంతో అతని స్థానంలో స్పెషలిస్టు పేసర్ రాణాను ఎలా తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సబ్ స్టిట్యూట్ గా బౌలింగ్ కు రాగానే ఆన్ ఫీల్డు అంపైర్లతో దీనిపై బట్లర్ చర్చించాడు. రిఫరీ అనుమతితోనే ఈ చర్య జరగడంతో అతను సైలెంట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో సత్తా చాటిన రాణా.. లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్టన్ లను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. తాజాగా దీనిపై ట్రోలింగ్ జరుగుతోంది..






ఇది ఐపీఎల్ మ్యాచా..? లేక ఇంటర్నేషనల్ మ్యాచా..?
దూబే ప్లేస్ లో రీప్లేస్ మెంట్ గా దూబేను తీసుకురావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ సబ్ ను ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఎలా వాడుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో మ్యాచ్ మధ్యలో ఒక ప్లేయర్ స్థానంలో మరో ప్లేయర్ ను ప్రవేశ పెట్టవచ్చు. దీన్నే ఇంపాక్ట్ సబ్ అంటారు. నిన్నటి మ్యాచ్ లో ఇదే జరిగిందని ఎద్దేవా చేస్తున్నారు. ఒక కొందరు నెటిజన్లు బీసీసీఐ చీటింగ్ చేసి గెలిచిందని పేర్కొంటున్నారు. దూబేకు సరిసమానం రాణా ఎలా అవుతాడని, ఇరువురు భిన్న రకం ప్లేయర్లని గుర్తు చేస్తున్నారు. రాణా ఆల్ రౌండర్ అయితే, ఆసీస్ పర్యటనలో ఆల్ రౌండర్ గా నితీశ్ రెడ్డిని ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కంకషన్ రూల్ ని ఇలా అపహస్యం చేయడం తగదని, ఐసీసీ నిబంధనను కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. ఇండియాకు అనుకూలంగా నిర్ణయం జరిగింది ఒకే కానీ, ఒకవేళ రేపు ఐసీసీ టోర్నీలో ఇలానే ఏదైన ప్రత్యర్థి జట్టు ఈ రూల్ ను దుర్వినియోగం చేసి మ్యాచ్ గెలిస్తే ఎలా అని పలువురు భారత ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్లో ఎలాంటి చీటింగ్ కు అవకాశం లేకుండా చూడాలని పలువురు పేర్కొంటున్నారు. 


Also Read: Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు