Harmanpreet Kaur has been suspended: టీమిండియా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తన దురుసు ప్రవర్తనకు భారీ మూల్యం చెల్లించుకుంది. స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ పై 2 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం పడింది. టీమిండియా ఆడనున్న తదుపరి రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడకుండా భారత మహిళా కెప్టెన్ పై ఐసీసీ వేటు వేసింది. రెండు సందర్భాలలో క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనను గుర్తించిన ఐసీసీ హర్మన్ ప్రీత్ పై చర్యలు తీసుకుంది.  


బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ప్రవర్తనపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంపైర్ తనను ఔట్ గా ప్రకటించడంతో తీవ్ర అసహనానికి గురైన హర్మన్ ప్రీత్ వికెట్లను బ్యాట్ తో కొట్టింది. అంతటితో ఆగకుండా అంపైర్లను మాటలంటూ క్రీజు వదిలింది. కెప్టెన్ గా జట్టుకే కాదు క్రీడాభిమానులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి హర్మన్ ప్రీత్ పలుమార్లు తన ప్రవర్తనతో విమర్శల పాలవుతోంది. 


ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్ షిప్ లో భాగంగా బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో హర్మన్ ప్రీత్ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించింది. భారత ఇన్నింగ్స్ బంగ్లా స్పిన్నర్ నహిదా అక్టర్ వేసిన 34వ ఓవర్లో హర్మన్ ఆడిన బంతిని స్లిప్ లో క్యాచ్ పట్టి బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా అంపైర్ హర్మన్ ను ఔట్ గా ప్రకటించారు. అసహనానికి గురైన హర్మన్ వికెట్లను బ్యాట్ తో కొట్టడంతో పాటు అంపైర్లపై నోరు పారేసుకుంది. దాంతో హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది ఐసీసీ. క్రమశిక్షణా చర్యలలో భాగంగా లెవల్ 2 తప్పిదం కింద 3 డీమెరిట్ పాయింట్లను కోత విధించారు. 


అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిపై నోరు పారేసుకోవడంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.8 ఆర్టికల్ ప్రకారం మరో తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ సీరియస్ అయింది. అంతర్జాతీయ మ్యాచ్ లో హద్దు దాటి విమర్శ చేయడంతో లెవల్ 1 తప్పిదం కింద మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అవార్డు ప్రదానం చేసే సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టడంతో పాటు కౌర్ విమర్శలు చేసి మూల్యం చెల్లించుకుంది.


 దీంతో ఐసీసీ ఆమెపై కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్‌లో ఇవన్నీ సాధారణమేనని, కాకపోతే హర్మన్‌ కాస్త నియంత్రణలో ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. మ్యాచ్‌ అనంతరం అంపైర్ల పట్ల హర్మన్‌ ప్రవర్తించిన తీరు కూడా బాగోలేదని ఆక్షేపించింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో ఏ విచారణ అవసరం లేకుండా ఐసీసీ ఆమెపై క్రమశిక్షణా చర్యలలో భాగంగా 2 అంతర్జాతీయ మ్యాచ్ ల నిషేధం విధించింది.






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial