Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు అందుకున్నారు. టీ20 ఫార్మాట్ లో ప్రపంచంలోనే 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రీడాకారిణిగా హర్మన్ ఘనత సాధించారు. మహిళల టీ20 ప్రపంచకప్ లో నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కౌర్ కు 150వ టీ20 మ్యాచ్. అలాగే పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచారు. సుజీ బేట్స్, మెగ్ లానింగ్, స్టెఫానీ టేలర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మహిళా ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తింపు పొందారు.
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 5 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిరాశపరిచింది. ఆమె 20 బంతులాడి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ హర్మన్ కు 150వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.
హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులు
- 150 టీ20 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్. పురుషుల, మహిళల క్రికెట్ లో ఎవరూ ఇంతవరకు ఈ మైలురాయిని అందుకోలేదు.
- పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు చేసిన నాలుగో మహిళా క్రీడాకారిణి.
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన క్రికెటర్.
- టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (103) స్కోరు చేసిన భారత మహిళా క్రికెటర్.
- పొట్టి ఫార్మాట్ లో భారత తరఫున అత్యధిక సిక్సులు (70) కొట్టిన క్రీడాకారిణి.
- టీ20 ప్రపంచకప్ లో భారత తరఫున మిథాలీరాజ్ తర్వాత అత్యధిక మ్యాచ్ (14) లకు నాయకత్వం వహించిన కెప్టెన్.
ఇటీవల జరిగిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ వేలంలో హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ లీగ్ మార్చి 4 న ప్రారంభం కానుంది.
సెమీఫైనల్‌కు చేరిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్ తర్వాత సెమీ ఫైనల్‌కు చేరిన రెండో జట్టు టీమిండియానే. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కచ్చితంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.