Gautam Gambhir:


టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాపై గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ప్రశంసల జల్లు కురిపించాడు. యువ క్రికెటర్లకు అతడు ఆదర్శమని పేర్కొన్నాడు. క్రికెట్‌ చరిత్రలో అతడి కన్నా ఎక్కువ దెబ్బలు భరించినవాళ్లు లేరని వెల్లడించాడు. వందో టెస్టులోనూ షార్ట్‌పిచ్‌లో ఫీల్డింగ్‌ చేయడం అతడి గొప్పదనంగా వర్ణించాడు.


దిల్లీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్‌ (IND vs AUS) తలపడిన మ్యాచ్ చెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) కెరీర్లో వందో టెస్టు. టీమ్‌ఇండియా నుంచి ఈ అరుదైన ఘనతను కొద్ది మందే అందుకోవడం గమనార్హం. 'భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత సొగసుగా బ్యాటింగ్‌ చేసింది చెతేశ్వర్‌ పుజారా. అతడిని మించి దేహానికి బంతులు తగిలించుకున్నవాళ్లు లేరు. అతడు వందో టెస్టులో షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. సాధారణంగా ఈ ఫార్మాట్లో 50 మ్యాచులు ఆడితేనే ఆటగాళ్లు ఆ ఫీల్డింగ్‌ పొజిషన్‌ వదిలేస్తారు. కానీ అతడలా కాదు. జట్టు మనిషి. అతడి గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది' అని గౌతీ అన్నాడు. దేశ యువతకు అతడు ఆదర్శప్రాయుడని ప్రశంసించాడు. 


వందో టెస్టులో పుజారా భారీ స్కోర్లేమీ చేయలేదు. తొలి ఇన్నింగ్సులో ఏడు బంతులాడి డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్సులో  అజేయంగా నిలిచాడు. 'ఇదో గొప్ప టెస్టు మ్యాచ్‌. దురదృష్ట వశాత్తు తొలి ఇన్నింగ్సులో పరుగులు చేయలేదు. పది నిమిషాలు నిలబడితే స్కోర్‌ సాధించగలనని తెలుసు. నా కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉండటంతో కాస్త నెర్వస్‌గా అనిపించింది. ఇదో ప్రత్యేకమైన ఫీలింగ్‌. విన్నింగ్‌ బౌండరీ కొట్టడం బాగుంది. మిగతా రెండు టెస్టుల కోసం ఎదురు చూస్తున్నా' అని మ్యాచ్‌ ముగిశాక పుజారా చెప్పడం గమనార్హం.


IND vs AUS 2nd Test: అద్భతాలు జరగలేదు. అంచనాలు మారలేదు. ఫలితం తారుమారు కాలేదు. సొంతగడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి నిరూపిస్తూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది. 


రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది. 


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.